హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): మానవ అవయవాల అక్రమ రవాణా కేసులో తెలంగాణ సీఐడీ అధికారులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 16మంది అరెస్టయ్యారు. తాజాగా ఏపీలోని విజయనగరం జిల్లా సాలూరు మండలం గంగన్న దొరవలస గ్రామంలో నిందితుడు కొండగోని మురళీకృష్ణను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అతడి నుంచి బీఎండబ్ల్యూ కారు స్వాధీనం చేసుకున్నారు. మురళీకృష్ణను హైదరాబాద్‌కు తీసుకొచ్చి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరడంతో జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అవయవ దానం, అవయవ మార్పి డి పేరుతో రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని అలకానంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మానవ అవయవాల అక్రమ రవాణా జరుగుతున్నట్టు ఇటీవల వెలుగులోకి వచ్చింది.
దీనిపై రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. అనంతరం ఈ కేసు దర్యాప్తును సీఐడీకి బదలాయించారు. సీఐడీ అదనపు డీజీపీ చారుసిన్హా నేతృత్వంలో కేసు దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ఇప్పటివరకు మొత్తం 17 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో కొందరు ఉద్యోగ అవకాశాల పేరుతో తమిళనాడుకు చెందిన నిరుపేదలు, అమాయకులను హైదరాబాద్‌కు తరలించి, ఇతర నిందితుల సహాయంతో అక్రమంగా కిడ్నీలు మార్పిడి చేసేవారని సీఐడీ అధికారులు తెలిపారు. అక్రమ అవయవ మార్పిడికి మురళీకృష్ణ రూ.10 లక్షలు తీసుకుని, 4లక్షలు చెల్లించేవాడని వివరించారు.