సుల్తానాబాద్, సెప్టెంబర్ 11: అధ్వానంగా మారిన గురుకులాల్లో పిల్లల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతున్నది. ఇటీవల మెట్పల్లి మండలంలోని గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపింది. తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రీనగర్ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో బుధవారం ఓ విద్యార్థి పాముకాటుకు గురికావడం ఆందోళన కలిగించింది. సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రీనగర్ గురుకుల కళాశాలలో జూలపల్లి మండలం కాచాపూర్‌కు చెందిన బత్తిని మన్విత్ ఆరో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే బుధవారం మధ్యాహ్న భోజనం చేశాడు. కాసేపటికి మలవిసర్జన కోసం ఆవరణలోని బాత్రూమ్కు వెళ్తుండగా పాముకాటు వేసింది. దీంతో మన్విత్ కేకలు వేయడంతో సిబ్బంది వెంటనే గమనించి సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుడి సూచనల మేరకు కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటీకీ 24 గంటలు పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రావణ్‌కుమార్ సిబ్బంది కలిసి దవాఖానకు చేరుకుని విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కళాశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉండటం, పక్కనే పాడుబడ్డ రైస్‌మిల్లు ఉండటంతో పాములు సంచరిస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు.