మెట్పల్లి రూరల్/కోరుట్ల, డిసెంబర్ 18: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. గత జూలై 26న రాజారపు గణాదిత్య, ఆగస్టు 9న ఎడమల్ల అనిరుధ్ అనే ఇద్దరు విద్యార్థులు విష కీటకం కుట్టి చనిపోయిన ఘటనలు మరవకముందే మరో విద్యార్థి బుధవారం పాముకాటు కు గురికావడం కలకలం రేపింది.
మెట్పల్లి పట్టణానికి చెందిన ఓంకార్ అఖిల్ పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం స్నానం చేసే సమయంలో చేతికి నొప్పి వస్తుందని, తల తిరుగుతున్నదని తోటి విద్యార్థులకు తెలిపాడు. వారు విషయాన్ని ప్రిన్సిపాల్ మాధవీలత దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆమె విద్యార్థి తండ్రి రవికి సమాచారం ఇచ్చి కోరుట్లలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు కుడిచేతి మణికట్టుపై పాముకాటేసినట్టు గుర్తించారు. ముందుజాగ్రత్తగా యాంటీ వీనమ్ ఇంజక్షన్ ఇచ్చి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.