హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఖజానాకు మరో రూ.2 వేల కోట్లు చేరనున్నాయి. బాండ్ల విక్రయం ద్వారా ఆమేరకు నిధులను సమీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. వెయ్యి కోట్ల విలువైన బాండ్లను ఎనిమిదేండ్ల కాలానికి, మరో వెయ్యి కోట్ల విలువైన బాండ్లను తొమ్మిదేండ్ల కాలానికి జారీచేసింది.
ఈ బాండ్లను ఆర్బీఐ వచ్చే మంగళవారం వేలం వేయనున్నది. చివరిసారి ఆగస్టు 23న వెయ్యి కోట్లను రుణాల ద్వారా సమీకరించుకొన్న రాష్ట్ర సర్కార్, తాజాగా మరో రెండు వేల కోట్ల విలువైన బాండ్లను జారీచేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి ప్రభుత్వం తీసుకొనే రుణాల మొత్తం రూ.18,500 కోట్లు అవుతుంది. వీటిని మూలధనం కింద ఖర్చు చేసి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలని సర్కారు భావిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.53,970 కోట్ల మేర రుణ సమీకరణ చేయాలని ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది.