హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ మోసం వెలుగులోకి వచ్చింది. బైబ్యాక్ పాలసీ పేరుతో సువర్ణభూమి ఇన్ఫ్రా డెవెలపర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని శ్రీధర్, డైరెక్టర్ బొల్లినేని దీప్తి తమను నిలువునా మోసగించారని వాపోతూ పలువురు సాప్ట్వేర్ ఉద్యోగులు సోమవారం సీసీఎస్‌ను ఆశ్రయించారు. 2021-2022లో ఆ సంస్థ బైబ్యాక్ స్కీమ్‌ను అఫర్ చేసిందని, రూ.35 లక్షల పెట్టుబడి పెడితే రెండేండ్లలో రూ.55 లక్షలు వస్తాయని నమ్మబలకడంతో ఒక్కొక్కరు రూ.35 లక్షల నుంచి రూ.కోటి వరకు పెట్టుబడులు పెట్టామని బాధితులు తెలిపారు. దీంతో ఈ పెట్టుబడులకు భరోసా కల్పిస్తూ ఆ సంస్థ కొన్ని ప్లాట్లను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ ఒప్పంద గడువు పూర్తయిన తర్వాత తమకు ఇస్తామన్న డబ్బును చెల్లించకుండా కాలయాపన చేస్తున్నదని వివరించారు. ఈ నేపథ్యంలో తమకు ఇస్తామన్న ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని, వాటి హద్దులను చూపించాలని కాళ్లు అరిగేలా తిరిగినా ఆ సంస్థ నిర్వాహకులు పట్టించుకోవడం లేదని, పైపెచ్చు ఏమి చేస్తారో చేసుకోండంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు 30 మంది బాధితులు సోమవారం సీసీఎస్ డీసీపీ శ్వేతకు ఫిర్యాదు చేశారు.