వరంగల్, జూన్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో ఇప్పటికే ఉన్న గ్రూపుల పంచాయితీకి మరో సమస్య వచ్చిపడింది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి అసెంబ్లీకి తాను పోటీ చేస్తానని మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత ప్రకటించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య తీవ్ర విభేదాలు ఉన్న విషయం తెలి సిందే. కొండా సురేఖ కూతురి ప్రకటన తో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మరింత ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో మంత్రి సురే ఖ, ఆమె భర్త కొండా మురళీధర్‌రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు… బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పలుసార్లు పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. పీసీసీ క్రమశిక్షణా సంఘం.. కొండా మురళి నుంచి వివరణ కోరింది.
పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులపై విచారణ జరుగుతుండగానే సురేఖ కూతురు సుష్మిత పరకాల సెగ్మెంట్ తమదే అన్నట్టుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కొండా సురేఖ 2009, 2012, 2018 ఎన్నికల్లో పరకాల సెగ్మెంట్లో పోటీ చేశారు. గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పరకాల సెగ్మెంట్లో తాము మద్దతు ఇస్తేనే రేవూ రి గెలిచారని కొండా మురళి పదేపదే అంటున్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఖండిస్తూ వస్తున్నారు. సురేఖ పరకాలలో ఓడిపోయిన తర్వాతే వరంగల్ తూర్పు సెగ్మెంట్‌కు వెళ్లారని రేవూరి చెప్తున్నారు. ఇలా పరస్పరం విమర్శలు చేసుకుంటున్న తరుణంలో మరోసారి పరకాల సెగ్మెంట్ తమదే అన్నట్టు సుష్మిత పేర్కొనడంపై రేవూరి ప్రకాశ్‌రెడ్డి మండిపడుతున్నారు. మంత్రి కుటుంబం, ఎమ్మెల్యే మధ్య విభేదాలతో పరకాల సెగ్మెంట్లోని కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడిపోయారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నా రెండు వర్గాల పోరుతో అభివృద్ధి పరంగా, పదవుల పరంగా వెనుకబడి పోతున్నామని ఆవేదన చెందుతున్నారు.