హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): మాంసం దుకాణాల నుంచి వచ్చే జీవ వ్యర్థాలు, చెత్తతో బయోగ్యాస్, బయో మాన్యూర్ను ఉత్పత్తి చేసే మరో ప్లాంట్‌ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఓల్డ్ బోయిన్పల్లి, గుడిమల్కాపూర్ మార్కెట్లలో రెండు ప్లాంట్ల ఏర్పాటుకు టెక్నాలజీని అందించిన ఈ సంస్థ.. తాజాగా సిద్దిపేటలో జీరో సెకండరీ వేస్టేజ్, బయో మీథేన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించింది.
స్లాటర్ హౌస్‌లో బయో గ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి అని, ఈ ప్లాంట్ ద్వారా రోజూ దాదాపు 500 కిలోల తడి చెత్త, 40 క్యూబిక్ మీటర్ల ద్రవరూప వ్యర్థాలతో బయో మీథేన్ గ్యాస్‌ను ఉత్పత్తి చేసే వీలున్నదని ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ గంగాగ్నిరావు తెలిపారు. ఐఐసీటీ టెక్నాలజీతో సెకండరీ వేస్టేజ్‌కి ఆస్కారం ఉండదు.
పేటెంట్ హక్కులను కలిగిన ఈ సాంకేతికతతో అపార్టుమెంట్లు, రెసిడెన్షియల్ కాలనీలు, హోటళ్లు, క్యాంటీన్లు సహా ఆహార వ్యర్థాలు వచ్చే అన్ని ప్రాంతాల్లో తక్కువ స్థలంలోనే బయో గ్యాస్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. అందుకు అవసరమయ్యే మెషినరీ తయారీ బాధ్యతలను ఇతర కంపెనీలకు ఐఐసీటీ అందజేస్తున్నది.