సత్తుపల్లి టౌన్, మార్చి 9: సైలో బంకర్ కాలుష్యం కారణంగా ఆదివారం మరొకరు మృతిచెందారు. దీంతో కాలు ష్యం కారణంగా జరిగిన మరణాలు మూడుకు చేరుకున్నాయి. ఖమ్మం జిల్లా సింగరేణి సత్తుపల్లి జేవీఆర్-1, 2, కిష్టా రం ఉపరితల గనుల్లో ఉత్పత్తి అయిన బొగ్గును బెల్టు ద్వారా కిష్టారం సమీపంలోని సైలో బంకర్‌కు తరలిస్తుంటారు. ఆ బొగ్గును రైలు వ్యాగన్లలోకి ఈ సైలో బంకర్ నింపుతుంది.
ఇలా నింపే క్రమంలో భారీగా వెలువడుతున్న బొగ్గుపొడి అక్కడికి 90 మీటర్ల సమీపంలోనే ఉన్న అంబేద్కర్‌నగర్ కాలనీపై పడుతున్నాయి. దీంతో అదే కాలనీకి చెందిన బుర్ర తుకారాం (36) ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బారినపడ్డాడు. ఈ సైలోబంకర్ కాలుష్యంతో తనకు ప్రాణహాని ఉం దంటూ జనవరి 17న సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సైలోబంకర్ను తరలించాలని లేదంటే పునరావాసం కల్పించడంగానీ చేయాలంటూ కాలనీవాసులు నెల రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. అయినా, అటు సింగరేణి గానీ, ఇటు ప్రభుత్వంగానీ స్పందించలేదు. అదే కాలనీకి చెందిన పిల్లి లక్ష్మీనారాయణ (47) శుక్రవారం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో మృత్యువాత పడ్డాడు. అతడు మరణించి రెండు రోజులు కూడా గడవకముందే అదే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, క్యాన్సర్ వ్యాధితో రామాల బుజ్జిబాబు (39) ఆదివారం మృతిచెందాడు.