Korean Flycatcher | హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ పక్షుల వైవిధ్యానికి నెలవుగా మారుతున్నది. ఇందుకు నిదర్శనంగా రాష్ట్రంలో మరో కొత్తజాతి పక్షి వెలుగుచూసింది. ప్రముఖ పక్షి పరిశీలకుడు హరిగోపాల్ శ్రీరంగం.. మహబూబాబాద్ జిల్లాలోని భీమునిపాదం జలపాతం వద్ద ఏప్రిల్ 23న పసుపువర్ణంతో కూడిన ఓ పక్షిని చూశాడు. అది అరుదైన పక్షి కావడంతో దాని ఫొటోను ఈ-బర్డ్ డాటాబేస్‌లో అప్లోడ్ చేశాడు. గమనించిన నిపుణులు దానిని కొరియన్ ఫ్లైక్యాచర్గా గుర్తించారు.
దీంతో దానిని రాష్ట్రంలో 445వ పక్షిజాతిగా నమోదుచేశారు. ఈ సందర్భంగా హరిగోపాల్ మాట్లాడుతూ.. ఈ ఫ్లైక్యాచర్ తూర్పు ఆసియాకు చెందినదని, చలికాలంలో కఠినమైన వాతావరణాన్ని తట్టుకునేందుకు నవంబర్, డిసెంబర్ నెలల్లో దక్షిణాసియాకు వలసవస్తుందని తెలిపారు. ఇప్పటికే ఈ పక్షి కేరళ, కర్ణాటక, గోవా, తమిళనాడు, ఒడిశాలో కనిపించినా తెలంగాణలో మాత్రం ఎప్పుడూ కనిపించలేదన్నారు. ఈ పక్షి వేసవిలో కొరియా, మంగోలియా, జపాన్‌లో సంతానోత్పత్తి చేస్తుందని చెప్పారు. తెలంగాణ గడ్డపై కొరియన్ ఫె్లైక్యాచర్ను రికార్డ్ చేసిన మొదటి వ్యక్తిగా తాను క్లౌడ్‌నైన్‌లో గుర్తింపు పొందినట్టు తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌లో అదే భీమునిపాదం జలపాతం వద్ద మరో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ శ్రీరామ్‌రెడ్డి 444వ పక్షిగా కనిపించిన సేలీథ్రస్ట్ను రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే.