Weather Report | బంగాళాఖాతంలో ఈ నెల 15 నాటి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే సూచనలున్నాయని.. ఆదివారానికి ఇది అల్పపీడనంగా బలపడుతుందని పేర్కొంది. అల్పపీడనంగా మారిన తర్వాత 48 గంటల్లు పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరానికి చేరువవుతుందని పేర్కొంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 16న ఏపీలోని నెల్లూరు, ప్రకాశంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 17న కోస్తా, రాయలసీమలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని.. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని చెప్పింది.
ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారి.. బలహీనపడింది. ఇక తెలంగాణలో రాగల వారం రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని.. రెండురోజుల్లో అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు పొడి వాతావరణం ఏర్పడుతుందని.. 18 నుంచి తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.