హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ అప్పుల పరంపర కొనసాగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో నెలలో మరోసారి రూ.4 వేల కోట్లను రిజర్వు బ్యాంకు బాండ్ల వేలంతో ప్రభుత్వం సమీకరించుకున్నది. గత నెలలో రూ.6,900 కోట్ల అప్పు తీసుకున్న సంగతి తెలిసిందే. రెండు నెలల్లో ప్రభుత్వం తీసుకున్న అప్పు రూ.10,900 కోట్లకు చేరుకున్నది. ఈ మేరకు బాండ్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. రూ.2 వేల కోట్లను 17 ఏండ్ల కాలపరిమితితో సేకరించగా, మరో రూ. 2వేల కోట్లను 30 ఏండ్ల కాలపరిమితితో సమీకరించింది. ఈ ఏడాది తెలంగాణ రుణభారం రూ. 8.64 లక్షల కోట్లకు మించనుంది. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.82 వేల కోట్లు రుణంగా తీసుకోవాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. ఇందులో వడ్డీలు, అసలు చెల్లింపులకే రూ.44,329 కోట్లను అంచనా వేసుకోగా కొత్త అప్పులతో వడ్డీల భారం మరింత పెరుగనున్నది. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ ఆదాయంకంటే అప్పులద్వారా వచ్చే నిధులపైనే ఎక్కువగా ఆధారపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఆర్థిక క్రమశిక్షణకు సవాలుగా మారింది.