K. Laxma Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ)/మహేశ్వరం: శ్రీశైలం జాతీయ రహదారి పక్కనే చేసిన రియల్ వెంచర్‌తో సూరం చెరువు కబ్జాకు గురైన మాట వాస్తవమేనని మహేశ్వరం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) తెలిపారు. ఆ ప్రాజెక్టు నుంచి తాను గతంలోనే తప్పుకున్నానని చెప్పారు. కబ్జాకు గురైన 60.32 ఎకరాల సూరం చెరువుపై ‘నమస్తే తెలంగాణ’లో శనివారం ‘హైడ్రా… ఇటు చూడు – చెరువులో కాంగ్రెస్ నేత వెంచర్’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కేఎల్ఆర్ నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. ఆ వెంచర్‌ను తాను ప్రారంభించిన మాట నిజమేనని, ఆ సమయంలో చెరువు భూముల్లో తాము లేఅవుట్ వేయలేదని చెప్పారు.
వర్టెక్స్ వీవీ రాయవర్మ ప్రవేశించిన తర్వాత చెరువు భూమిని కబ్జా చేస్తుండటంతో ఆ ప్రాజెక్టు నుంచి తన వాటా తీసుకొని వైదొలిగినట్టు వివరించారు. ఈ చెరువు కబ్జాపై తానే చాలాకాలంగా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేస్తున్నానని, అధికారులు స్పందించడం లేదని అన్నారు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సైతం ఈ చెరువు కబ్జాపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ వెంచర్లో కేవలం సూరం చెరువు మాత్రమే కాదని, ఇంకో నీటి వనరును కూడా పూర్తిగా మట్టితో పూడ్చివేశారని కేఎల్ఆర్ వెల్లడించారు. ఈ కబ్జాలపై ఫిర్యాదు చేసి, పోలీసు కేసులు కూడా నమోదు చేయించినట్టు చెప్పారు. తానే చెరువు కబ్జా చేసినట్టు వచ్చిన వార్తలో నిజం లేదని అన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన కేఎల్ఆర్ ప్రస్తుతం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. సూరం చెరువు కబ్జాపై స్వయంగా ఆయనే జూలై 12న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, జూలై 16న తుక్కుగూడ మున్సిపాలిటీ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నెల 8న నీటిపారుదల శాఖ డీఈఈకి కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆయన ఫిర్యాదులపై అధికార యంత్రాంగం స్పందించకపోవడం ఏమిటని పలువురు విస్తుపోతున్నారు.
ప్రస్తుతం రియల్ వెంచర్లో తాను భాగస్వామిని కాదని, అయినప్పటికీ ‘నమస్తే తెలంగాణ’లో తానే చెరువును కబ్జా చేసినట్టు వచ్చినందున పత్రికపై పరువునష్టం దావా వేస్తానని కేఎల్ఆర్ స్పష్టంచేశారు. అయితే అన్ని ఆన్లైన్ వెబ్‌సైట్స్, గూగుల్‌లో ఇప్పటికీ వర్టెక్స్-కేఎల్ఆర్ డెవలపర్స్ ఎల్ఎల్పీ పేరే కనిపిస్తున్నది. అదీగాక మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ అధికారిక వెబ్సైట్లో పరిశీలించగా.. ఈ డెవలపర్స్ ఎల్ఎల్పీఇన్-ఏఏఎన్-5936 నంబరుతో ఇప్పటికీ భాగస్వామ్యం కొనసాగుతున్నట్టుగా తేలింది.
భాగస్వామ్యం (ఎల్ఎల్పీ) స్టేటస్ యాక్టివ్ (కొనసాగుతుంది)గానే ఉంది. ఇందులో కేఎల్ఆర్ కుమారుడు కిచ్చన్నగారి అభిషేక్, మురళీమోహన్ చక్కగురు భాగస్వాములుగా ఉన్నారు. దీనిపై కేఎల్ఆర్ను సంప్రదించగా.. వెంచర్లో ఒక భాగం వరకు మాత్రమే తమ భాగస్వామ్యం కొనసాగుతున్నదని, చెరువును కబ్జా చేసిన వైపు తనది లేదని చెప్పారు. ఒకే ప్రహరీలో రెండు వేర్వేరు వెంచర్లు సాధ్యమా? అన్నది ఎవరికీ అంతుబట్టని అంశం.