హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): వ్యాక్సిన్ హబ్ హైదరాబాద్ నుంచి అతి త్వరలో మరో కరోనా టీకా అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్‌ను అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించగా.. త్వరలో బయోలాజికల్-ఈ (బీఈ) టీకా రానున్నది. బీఈ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు శనివారం అనుమతులు వచ్చినట్టు సంస్థ ఎండీ మహిమ దాట్ల తెలిపారు. గతంలో తాము నిర్వహించిన ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని చెప్పారు. టీకా సమర్థంగా పనిచేసిందని, సురక్షితంగా నిరూపితమయిందని పేర్కొన్నారు. ఈ ఫలితాలను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)కు పంపించామని వివరించారు.
సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) వీటిని సమగ్రంగా విశ్లేషించిన తర్వాత ఫేస్-3 క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా సూచించిందని చెప్పారు. ఈ మేరకు సీడీఎస్‌సీవో నుంచి బీఈకి అనుమతులు వచ్చినట్టు వెల్లడించారు. బయోలాజికల్-ఈ సంస్థ అమెరికాలోని టెక్సాస్ చిల్ట్రన్స్ హాస్పిటల్ సెంటర్, డైనావాక్స్ టెక్నాలజీస్ కార్పొరేషన్‌తో కలిసి టీకాను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్‌ను ‘సీపీజీ 1018టీఎం’గా పిలుస్తున్నారు. గతేడాది నవంబర్ రెండోవారంలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. ఫేజ్-1, ఫేజ్-2 ట్రయల్స్‌లో మొత్తం 360 మంది ఆరోగ్యవంతులైన వలంటీర్లపై ప్రయోగాలు జరిపినట్టు సంస్థ తెలిపింది. ఇందులో 18- 65 ఏండ్ల మధ్యవారు ఉన్నట్టు పేర్కొన్నది. మొదటి డోస్ వేసుకున్న తర్వాత 28 రోజులకు రెండోడోస్ వేసినట్టు, వ్యాక్సిన్ సురక్షితమైనదిగా, సమర్థమైనదిగా తేలినట్టు పేర్కొన్నది.
15 నగరాల్లో 12,68 మందిపై..
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో మూడోదశ క్లినికల్ ట్రయల్స్ జరుపుతామని బయోలాజికల్-ఈ ఒక ప్రకటనలో తెలిపింది. మనదేశంలో 15 నగరాల్లో 1,268 మందిపై ప్రయోగాలు జరుపనున్నట్టు పేర్కొన్నది. ఇందుకోసం 18-80 ఏండ్ల మధ్య వయసు వలంటీర్లను ఎంపిక చేయనున్నారు. బయోలాజికల్-ఈ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ఆగస్టులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. మే నెలలో మూడోదశ క్లినికల్ ట్రయల్స్ మొదలవుతాయని అంచనా. బీఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే పేద, మధ్యతరగతి దేశాలకు పెద్ద ఊరట లభిస్తుందని టెక్సాస్ చిల్ట్రన్ హాస్పిటల్ అసోసియేట్ డీన్ డాక్టర్ మరియా ఎలెనా బొట్టాజి తెలిపారు.
త్వరలో ప్రపంచానికి మరో వ్యాక్సిన్
ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్‌లో వచ్చిన సానుకూల ఫలితాలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. మేం అభివృద్ధి చేసిన టీకా విజయవంతం అయినందుకు ఆనందంగా ఉన్నది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచానికి మరో వ్యాక్సిన్‌ను అందిస్తాం. త్వరలోనే దేశవ్యాప్తంగా 15 నగరాల్లో ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తాం.