హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మపై మరో కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం రామచంద్ర భారతిపై తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామచంద్ర భారతి ఫేక్ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు ఇతర ఫేక్ కార్డులను కలిగి ఉన్నారని, వాటిపై దర్యాప్తు చేపట్టాలని ఫిర్యాదులో రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రాచమంద్రభారతి, సింహాయాజి, నందకుమార్‌లో చంచల్‌గూడ జైల్లో ఉన్న విషయం విదితమే.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలను కొనుగోలు కేసులో పట్టుబడ్డ ముగ్గురు నిందితుల దర్యాప్తుపై కోర్టు స్టే ఎత్తేసింది. బీజేపీ పిటిషన్‌ను కోర్టు పెండింగ్‌లో పెట్టింది. పిటిషన్‌పై లోతైన విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారనే ఆరోపణలతో మోయినాబాద్ ఫాం హౌస్‌లో 26వ తేదీ రాత్రి రామచంద్ర భారత అలియాస్ సతీశ్ శర్మ, సింహయాజీ, నంద కుమార్‌లను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపుర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావులను పార్టీ ఫిరాయించేలా ప్రలోభపెట్టారని పోలీసులు తెలిపారు.