హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన ‘హ్యాపీ ఫ్యూచర్ మల్టీ పర్పస్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ కేసులో మరో నిందితుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు.. నిరుద్యోగ విద్యావంతులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగ అవకాశాల పేరుతో భారీ మొత్తంలో డబ్బులు సేకరించారు. అనంతరం ఆ నిధులను దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఏ-5 నిందితుడు ఎం.దినేశ్ కుమార్ అలియాస్ సంతోష్ కుమార్‌ను 20న సీఐడీ బృందం కోయంబత్తూరులో అరెస్ట్ చేసింది. అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై నాంపల్లి ఆరో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు ఆయనను రిమాండ్‌కు పంపింది. ఇదే సంస్థపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన దినేష్ కుమార్ మిగతా 10 కేసుల్లో కూడా ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.