హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టానికి మరో 1,500 మోగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ప్లాంట్ను కేంద్రం మంజూరుచేసింది. ఇప్పటికే 500 మోగావాట్ల ప్లాంట్ రాష్ట్రానికి మంజూరుచేయగా, తాజాగా మరో 1,500 మోగావాట్ల ప్లాంట్ను కేటాయించింది. ఈ పాంట్ల ఏర్పాటుకు జనగాం సహా మరో రెండు చోట్ల టీజీ జెన్కో అధికారులు స్థలాలను పరిశీలించారు. అయితే ఇవి సబ్స్టేషన్ల స్థలాలు కావడం గమనార్హం. ఈ ప్లాంట్ల ఏర్పాటుకయ్యే వ్యయంలో 30% వయబిలిటీ గ్యాప్ ఫండ్(వీజీఎఫ్) కింద కేంద్రప్రభుత్వం కేటాయిస్తుంది. 70% ప్లాంట్ ఏర్పాటు చేసుకునే వారు భరించాల్సి ఉంటుంది.
ఈ ప్లాంట్లల్లో విద్యుత్తును బ్యాటరీల్లో నిల్వచేస్తారు. మార్కెట్లో విద్యుత్తు ధర తక్కువగా ఉన్నప్పుడు విద్యుత్తును స్టోరేజ్ చేయడం.. డిమాండ్ అధికమయ్యినప్పుడు.. ఎక్కువ ధర ఉన్నప్పుడు వినియోగించుకోవడం ఈ ప్లాంట్ల ప్రత్యేకత. కొత్త ప్లాంట్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించనున్నట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో 500 మెగావాట్ల బ్యాటరీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి ఈ స్థలం జెన్కోదే కానీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఇలాంటి ప్లాంట్లను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంపై విమర్శలొస్తున్నాయి. టీజీ జెన్కోనే సొంతంగా ఈ ప్లాంట్లు ఏర్పాటుచేయాలంటూ జెన్కో ఇంజినీర్లు కోరుతున్నారు.