హైదరాబాద్, అక్టోబర్9 (నమస్తే తెలంగాణ): నైతిక విలువలతో కూడిన జీవితం కావాలనుకొనే వారంతా రామాయణ మహాకావ్యాన్ని నిత్య పారాయణ గ్రంథంగా భావిస్తారని, అంతటి మహత్తరమైన గ్రంథ సృష్టికర్త, ప్రపంచానికి జ్ఞాననిధిని అందించిన వాల్మీకి మహర్షి సదా పూజ్యనీయుడని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్, బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రామాయణ పరివారం గ్రంథ రచయిత బుర్రా వెంకటేశం కీర్తించారు. వాల్మీకి జయంతిని బీసీ సంక్షేమశాఖ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వకుళాభరణం, బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. వాల్మీకి ఔన్నత్యాన్ని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర, కిశోర్‌గౌడ్, బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్యభట్టు, ఉన్నతాధికారులు బాలాచారి, చంద్రశేఖర్, ఉదయ్, విమల, మంజుల, జిల్లా అధికారులు ఆశన్న, సిబ్బంది పాల్గొన్నారు.