హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): అన్నారం పంపులు మళ్లీ గర్జించాయి. విపక్షాల విమర్శలను తిప్పి కొడుతూ.. తగ్గేదే లే అంటూ.. నీటి కొండల్ని ఎత్తిపోశాయి. కనీవినీ ఎరుగని వరదలతో నీట మునిగిన అన్నారం పంప్‌హౌస్.. కేవలం 45 రోజుల్లోనే తిరిగి పని ప్రారంభించేందుకు సిద్ధమంటూ విజయ ప్రకటన చేసింది. రికార్డు సమయంలో అన్నారం పంప్‌హౌస్‌ను మళ్లీ సిద్ధం చేసిన ఇంజినీరింగ్ అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. 500 ఏండ్లకు ఒకసారి వచ్చేస్థాయిలో గోదావరిలో ఈసారి వరద పోటెత్తిన విషయం తెలిసిందే. అసాధారణ రీతిలో వర్షాలతో ఊహించని రీతిలో తలెత్తిన ఈ ప్రకృతి విపత్తుతో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్‌లు గత జూలై 14న పూర్తిగా నీట మునిగాయి. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో 17, అన్నారం పంప్‌హౌస్‌లో12 మోటర్లు ఉన్నాయి. అవి ఒక్కోటి 40 మెగావాట్ల సామర్థ్యం కలవి. కంట్రోల్ ప్యానళ్లు సైతం నీట మునిగాయి. ఆ వెంటనే పంప్‌హౌస్‌ల మునకపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని సాగునీటి రంగ నిపుణులు వెల్లడించారు.
వరదలు పూర్తిగా సద్దుమణిగాక బురదను తొలగించి తిరిగి పంపులను ప్రారంభించుకోవచ్చని, గతంలో శ్రీశైలం, కల్వకుర్తి పంప్‌లను అదే తరహాలో పునరుద్ధరించిన సందర్భాలున్నాయని నొక్కిచెప్పారు. అయినప్పటికీ ఇదే అదనుగా ప్రతిపక్ష పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు సైతం కాళేశ్వరం ప్రాజెక్టుపై బురదజల్లేందుకు తీవ్రంగా యత్నించారు. ప్రాజెక్టు పేరిట లక్షల కోట్లు వృథా చేసిందని, డిజైన్ లోపాలున్నాయని అంటూ తెలంగాణ ప్రభుత్వంపై విషప్రచారాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఆగస్టు 18న ప్రత్యేకంగా అసెంబ్లీలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతిపక్షాల ఆరోపణలకు దీటుగా సమాధానమిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శల్లోని డొల్లతనాన్ని బయటపెట్టారు. మునిగిన కాళేశ్వరం పంప్‌లను మరో 45 రోజుల్లో తిరిగి వినియోగంలోకి తెస్తామని, యాసంగికి నీరందిస్తామని ప్రకటించారు. అదే సందర్భంగా గతంలో మాదిరి చేతులు ఎత్తేయకుండా ఈ సారైనా పంట కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రమంత్రికి సవాల్ విసిరారు. హామీ మేరకు పంప్‌లను నిర్ణీత గడువులోగా ప్రారంభించి కాళేశ్వరంపై చేసిన ఆరోణలన్నీ అవాస్తవాలని మరోసారి చాటిచెప్పారు.
అన్నారం మొదటి పంప్ వెట్ రన్ జయప్రదం
వరదలు తగ్గిన వెంటనే అధికారులు మోటర్లకు మరమ్మతు పనులను చేపట్టారు. పంప్‌హౌస్‌ల్లోకి చేరిన వరద నీటిని తోడేశారు. బురదను పూర్తిగా తొలగించారు. అనంతరం మోటర్లను, ఎలక్ట్రికల్ పరికరాలను విప్పి ఏమాత్రం తేమ లేకుండా ఆరబెట్టే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు. అందులో భాగంగా శనివారం తొలుత ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో అన్నారం పంప్‌హౌస్‌లోని 12 మోటర్లలో మొదటి పంప్‌ను ఇంజినీరింగ్ అధికారులు ప్రారంభించారు. దీంతో మొదటి పంపు యథావిధిగా జయప్రదంగా డిజైన్ డిశ్చార్జిని ఎత్తి పోసిందని అధికారులు వెల్లడించారు. ఇక వరుసగా ఒకదాని తరువాత మరొక పంప్‌ను రన్ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల చివరినాటికి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు అభినందనలు
అన్నారం పంప్‌హౌస్‌ను నిర్దేశిత గడువులోగా వినియోగంలోకి తీసుకురావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్నారం పంప్‌హౌస్‌లో మొదటి పంప్‌ను జయప్రదంగా నడిపిన ఇంజినీరింగ్ అధికారులను, పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లను ప్రత్యేక అభినందించారు. ఇదే స్ఫూర్తితో ముందుకుసాగి నిర్దేశిత గడువులోగా మిగతా పంప్‌లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇక నిర్దేశిత గడువులోగా పంప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన అధికారులకు ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్, ఈఎన్సీ (జనరల్) మురళీధర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కృషిలో పాలు పంచుకున్న ప్రతి ఒకరికీ అభినందనలు తెలియజేశారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదు. ముగినిన పంప్‌లను 45 రోజుల్లోనే తిరిగి వినియోగంలోకి తెస్తాం. ఈ యాసంగికి నీరందిస్తాం. గతంలో మాదిరి చేతులు ఎత్తేయకుండా ఈ సారైనా పంట కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకోవాలి’ అంటూ ఆగస్టు 18న మంత్రి హరీశ్‌రావు నొక్కిచెప్పారు. ఇప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టారు. శనివారం రోజున అన్నారం పంప్‌హౌస్‌ను పునఃప్రారంభించి కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలన్నీ ఉత్తివేనని మరోసారి ఎలుగెత్తి చాటిచెప్పారు. అన్నారం పంప్‌లను విజయవంతంగా రన్ చేసిన ఇంజినీరింగ్ అధికారులను అభినందించారు.