హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణన సర్వేను కుట్రగా మార్చేస్తున్నదని స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ సర్వే వెనుక సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాలు కనిపిస్తున్నాయని, బీసీలకు ఎలాంటి మేలు కలిగేలా కనిపించడం లేదని అనుమానం వ్యక్తంచేశారు. ప్రభుత్వం శాస్త్రీయ సర్వేకు మార్గం చూపకుండా, ప్రభుత్వమే గందరగోళం సృష్టిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేను కావాలనే న్యాయపర సమస్యల్లోకి నెట్టేలా చూస్తున్నదని ఆరోపించారు. సర్వే ప్రక్రియలో కాంగ్రెస్ జోక్యం దేనికోసమని విమర్శించారు.
అసలు ఈ సర్వే చేస్తున్నది ప్రభుత్వమా, కాంగ్రెస్ పార్టీయా? అని ప్రశ్నించారు. సరార్ కసరత్తును కాంగ్రెస్ సరస్గా నిర్వహించాలనుకోవడం దారుణమని పేర్కొన్నారు. హస్తం పార్టీ నేతల జోక్యం వల్ల గ్రామాల్లో సర్వే ప్రభావితమై, సామాజిక వర్గాల లెకలు తలకిందులయ్యే ప్రమాదమున్నదని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న కులగణన కోసం ఈ నెల 5న వివిధ వర్గాలతో సమావేశం కావడానికి రాహుల్‌గాంధీ ఎవరని, రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకున్న బాధ్యతలు ఏమిటని ప్రశ్నించారు. ఇదే పధ్ధతిలో ప్రభుత్వం కులాలు, కుటుంబాల వివరాలు సేకరిస్తే, బీసీలకు తీరని ద్రోహం జరగడం ఖాయమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కోర్టు తీర్పులను, విపక్షాల సూచనలను గమనంలోకి తీసుకొని సర్వేను నిర్వహించాలని డిమాండ్ చేశారు.