హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 24(నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్‌లోని ఓ అమ్మవారి ఆలయంలో అపచారం జరిగింది. ఆలయంలో శనివారం అర్ధరాత్రి సమయంలో జంతుబలి నిర్వహించినట్టు ఆలయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆలయ ప్రాంగణంలోని మాత గుడి వద్ద అర్ధరాత్రి సమయంలో రెండు మేకలను తీసుకొచ్చి ఒకటి అమ్మవారికి చూపించి బయటకు తీసుకుపోగా మరోదానిని అక్కడే బలిచ్చినట్టు ఆలయంలో చర్చ జరుగుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అమ్మవారి బోనాల సమయంలో రంగం చెప్పే ప్రాంతంలో జరిగిన ఈ తంతును ఆలయ వ్యవస్థాపక నిర్వాహకులతో పాటు అర్చక ఉద్యోగులు, ఇటీవల బోనాల సమయంలో పనిచేసిన కార్మికులు కొందరు ఉండి చేశారని, ఆ తర్వాత ఆలయం వెనకవైపు మరోమేకను వండుకుని తిన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అమ్మవారికి కూష్మాండబలి ఇవ్వడం ఆనవాయితీ కాగా అదికూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చేస్తారని, బోనాల సమయంలో ఇచ్చే బలులను ఆలయం వెలుపల కానీ, అక్కడే ఉన్న కొన్ని కాంప్లెక్స్‌లలో కానీ చేస్తారు తప్ప ఆలయం లోపల ఎప్పుడూ చేయలేదని ఇది అపచారమని భక్తులు అంటున్నారు. ఈ తంతుపై ఆలయ అధికారులు మాత్రం తమకేం తెలియదని, అలాంటిదేం జరగలేదని, జరిగిన తంతును బయటపడనీయకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారని స్థానికంగా చెప్పుకుంటున్నారు.