Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): వరద బాధితులను ఆదుకునేందుకు ఒక రోజు మూలవేతనాన్ని విరాళంగా ఇస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీలు పోటీపడి ప్రకటించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఉద్యోగ సంఘాల తీరును ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఉద్యోగ సంఘాలు జేఏసీలు పోటీపడి విరాళాలు ప్రకటించాయి. ఒక జేఏసీ రూ.130 కోట్లు, మరో జేఏసీ రూ.100 కోట్లు విరాళమిస్తామంటూ ముఖ్యమంత్రికి, సీఎస్‌కు అంగీకార పత్రాలను అందజేశాయి. దీనిని కొంత మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు. తమను సంప్రదించకుండా, అభిప్రాయం సేకరించకుండా ఇలా ఏకపక్షంగా ఎలా ప్రకటన చేస్తారని సోషల్‌మీడియాలో ఫైర్ అయ్యారు. డీఏ బకాయిలు విడుదల చేయించలేదు. సరెండర్‌లీవుల బిల్లులు ఇప్పించలేదు. పీఆర్సీ గురించి అడగరు.. కానీ ఎవరు అడిగారని ఒకరోజు వేతనం ఇస్తామని ఒప్పుకున్నారని మండిపడ్డారు. రెండు నెలల క్రితం బదిలీ అయిన ఉద్యోగులకు సగం నెల వేతనం ఇంకా ఇవ్వనేలేదని పేర్కొన్నారు. ఎవరి మెప్పు కోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారంటూ తిరుగుబాటు చేశారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్లు చేసి నీలదీసినంత పనిచేశారు. సహాయమనేది వ్యక్తిగతమని. ఎంత ఇవ్వాలని చెప్పడానికి ఎవరికీ హక్కులేదని స్పష్టం చేశారు. ‘విరాళం ప్రకటించడానికి ముందు ప్రాథమికంగా సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. అంతా నాయకులు ఇష్టమేనా.. ఎదుటి వాళ్ల జీతం మీద మీకు ఏం హక్కు ఉంది?’ అంటూ ఓ ఉద్యోగి సోషల్‌మీడియాలో తన అసంతృప్తిని వెల్లగక్కారు.