నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 15 : అంగన్వాడీల ఆందోళన అట్టుడికింది. ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించడంతోపాటు పలు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆందోళనకు దిగారు. సీఎం ఇంటితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించారు. ఆందోళనలో భాగంగా వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని సీఎం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేస్తూ పోలీసులను తప్పించుకొని ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. గ్రేటర్ వరంగల్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించగా, ములుగులోని మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించారు. పోలీసులు బారికేడ్లను అడ్డుగా పెట్టి అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఇంటిని ముట్టడించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించారు. మంత్రి అందుబాటులో లేకపోవడంతో మంత్రి వ్యక్తిగత సహాయకుడి ఫోన్ ద్వారా అంగన్వాడీ యూనియన్ నాయకులతో మాట్లాడిన మంత్రి వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అంగన్వాడీ టీచర్లు ధర్నా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ ఇంటి ఎదుట నిరసన తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు రూ.18 వేల వేతనంతోపాటు పీఎఫ్, పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు ఆలకించిన మంత్రి శ్రీహరి స్పందిస్తూ ఆర్థిక సమస్యల పరిషారానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని భరోసానిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కొడంగల్‌లోని సీఎం నివాసం ముట్టడికి తరలివచ్చిన అంగన్వాడీలను అడ్డుకునేందుకు యత్నిస్తున్న పోలీసులను ప్రతిఘటిస్తున్న అంగన్వాడీ టీచర్లు
నారాయణపేట జిల్లా మక్తల్‌లో తన ఇంటిని ముట్టడించిన అంగన్వాడీ టీచర్ల సమస్యలను వింటున్న మంత్రి వాకిటి శ్రీహరి