హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): జాతీయ విద్యావిధానంలో భాగంగా ఏర్పాటు చేయనున్న పీఎంశ్రీ స్కూళ్లతో ఐసీడీఎస్ల ఉనికి ప్రశ్నార్థం కానున్నది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో వీటి ఏర్పాటు మరింత ఇబ్బందికరంగా మారనున్నది. ఐసీడీఎస్లకు సమాంతరంగా పీఎంశ్రీ పాఠశాల వ్యవస్థ పనిచేయనున్నది. దీంతో సమీప భవిష్యత్లో అంగన్వాడీ సెంటర్లు నిర్వీర్యమయ్యే ముప్పు ఉన్నదని అంగన్వాడీ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఎంశ్రీ స్కూళ్ల ఏర్పాటును వెంటనే ఉపసంహరించుకోవాలనే డిమాండ్ చేస్తున్నారు.
చిన్నారులకు నర్సరీ విద్యనందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 14,500 ప్రభుత్వ పాఠశాలల్లో పీఎంశ్రీ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి ద్వారా 3-6 ఏండ్లలోపు చిన్నారులకు అక్షరాలు నేర్పించడంతోపాటు పౌష్టికాహారాన్ని అందిస్తారు. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తొలి విడతగా 58 ప్రభుత్వ పాఠశాలల్లో పీఎంశ్రీ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీటిని ప్రారంభించాలని ఇటీవల పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో గత 50 ఏండ్లుగా అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 5 ఏండ్లలోపు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడంతోపాటు పోషకాహారాన్ని అందిస్తున్నారు. అయితే పక్కా భవనాలు సమకూర్చడం, వసతుల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి సారించడంలేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పీఎంశ్రీ స్కూళ్ల ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాల్లోని 70 వేల మంది టీచర్లు, ఆయాలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు ఆందోళన చెందుతున్నారు.
మొబైల్ అంగన్వాడీలపై అభ్యంతరాలు
మొబైల్ అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానంలో ఒక చిన్న వాహనం ద్వారా చిన్నారులతోపాటు బాలింతలు, గర్భిణులకు ఆహారాన్ని పంపిణీ చేస్తారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రత్యామ్నాయంగా మొబైల్ అంగన్వాడీ సెంటర్లు పనిచేస్తాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అంగన్వాడీ కేంద్రాలను కనుమరుగుచేసే కుట్ర చేస్తున్నాయని యూ నియన్ నాయకులు మండిపడుతున్నారు.
అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్తున్న పాలకులు ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, నర్సరీ విద్యపేరిట అంగన్వాడీ సెంటర్లను చిన్నచూపు చూస్తూ వాటి ఉసురు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని అంగన్వాడీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుగడలో ఉన్న వ్యవస్థను విస్మరించి పీఎంశ్రీ, ప్రీ-ప్రైమరీ, మొబైల్ అంగన్వాడీ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పీఎంశ్రీ స్కూళ్లపై ప్రభుత్వం అభ్యంతరం తెలియజేయకుండా కేంద్రానికి వంతపాడడం సమంజసమని నిలదీస్తున్నారు.
పీఎంశ్రీ స్కూళ్ల ఏర్పాటుపై ప్రభుత్వ వైఖరిని సీఐటీయూ అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ జయలక్ష్మి తప్పుబట్టారు. కేంద్రం ప్రతిపాదనలకు గుడ్డిగా తల ఊపడం సరికాదని, దీని వల్ల తెలంగాణలోని సుమారు 70 వేల మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆందోళన చెందుతున్నారని ధ్వజమెత్తారు. పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేసి అందులోనే నర్సరీ విద్యను అందించాలని డిమాండ్ చేశారు.