హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో విద్యుత్తు సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. దీంతో పరిశ్రమలతోపాటు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. విద్యుత్తు కోతలు తీవ్రమవడంతో రోగులకు సేవలు అందించలేక వైద్యులు నిస్సహాయంగా ఉండిపోతున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ దవాఖానలో గురువారం రాత్రి నాగమణి అనే నిండు చూలాలికి కుటుంబసభ్యుల సెల్ఫోన్ల వెలుతురులో పురుడు పోయడం అక్కడి సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతున్నది. ఏపీ ట్రాన్స్కో లెక్కల ప్రకారం ఆ రాష్ట్రంలో రోజుకు 40-50 మిలియన్ యూనిట్ల విద్యుత్తు లోటు ఉన్నది. దీన్ని అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి 50% కోతలు విధించింది. విద్యుత్తు కోతల నేపథ్యంలో జనం రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.