హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ)/ముషీరాబాద్ / చిక్కడపల్లి / బన్సీలాల్‌పేట్: కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య జర్నలిస్ట్ స్వేచ్ఛ అంత్యక్రియలు ముగిశాయి. శుక్రవారం జవహర్‌నగర్‌లోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఆమెకు అంబర్‌నగర్‌లోని శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ముషీరాబాద్‌లోని స్వేచ్ఛ తల్లిదండ్రుల ఇంటి నుంచి శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. స్వేచ్ఛ తల్లిదండ్రులు శ్రీదేవి, శంకర్, ఆమె కూతురు రోదనలు మిన్నంటాయి. శ్మశానవాటికకు చేరుకున్న బీఆర్ఎస్, జర్నలిస్ట్ సంఘాల నేతలు, స్నేహితులు, ఆత్మీయులు స్వేచ్ఛ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం స్వేచ్ఛకు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు గాంధీ దవాఖానలో స్వేచ్ఛ భౌతికకాయానికి వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. తీరని దుఃఖంలోనూ స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆమె కండ్లు దానం చేసి, ఆదర్శంగా నిలిచారు.
గాంధీ మార్చురీకి వచ్చిన పలువురు జర్నలిస్టు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ స్వేచ్ఛ మరణం తమకు ఎంతో దిగ్భా్రంతి కలిగించిందని ఆవేదన వ్యక్తంచేశారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ ఎడిటర్ కే శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అధ్యక్షుడు విరాహత్ అలీ, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలురు గౌరీశంకర్, సీనియర్ జర్నలిస్ట్‌లు శైలేశ్‌రెడ్డి, మారురీసాగర్, పల్లె రవికుమార్, రమణ, టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రా ఆనంద్, అరుణోదయ ప్రజాగాయని విమలక్క, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, పలువురు జర్నలిస్టులు వారిలో ఉన్నారు.
స్వేచ్ఛ మృతికి పూర్ణచందరే కారణం: తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవి
తమ కూతురు స్వేచ్ఛ మృతికి పూర్ణచందరే కారణమని స్వేచ్ఛ తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవి ఆరోపించారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదేండ్లుగా పూర్ణచందర్, తన కూతురు కలిసి జీవిస్తున్నారని వెల్లడించారు. ఈనెల 26న స్వేచ్ఛ తనకు ఫోన్ చేసిందని, పూర్ణచందర్‌తో విడిపోవాలని అనుంటున్నట్టు చెప్పిందని తెలిపారు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టు తెలిపిందని వివరించారు. పూర్ణచందర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాలో పూర్ణచందర్ లేఖ!
స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ పేరుతో ఓ లేఖ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అందులో పూర్ణచందర్ స్వేచ్ఛతో అనుబంధం గురించి పలు అంశాలు వెల్లడించారు. స్వేచ్ఛ మృతిపట్ల అసలు నిజాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరముందని తెలిపారు. తాను స్వేచ్ఛను మోసం చేయలేదని చెప్పారు. స్వేచ్ఛతో 2009 నుంచి పరిచయం ఉందని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆలనాపాలనా లేక స్వేచ్ఛ ఎప్పుడూ ఒంటరిగా ఫీలయ్యేదని చెప్పారు. స్వేచ్ఛ కూతురును తానే చదివిస్తున్నానని, రెండేండ్లుగా ఆమె బాధ్యతలు చూసుకుంటున్నానని తెలిపారు. మీడియాకు లేఖ విడుదల చేసిన కాసేపటికి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో పూర్ణచందర్ లొంగిపోయాడు.
స్వేచ్ఛ నిఖార్సయిన తెలంగాణవాది: కేటీఆర్
స్వేచ్ఛ అకాల మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రసంతాపం ప్రకటించారు. ధైర్యంగా ప్రశ్నించే జర్నలిస్ట్, నిబద్ధత గల రచయిత్రి, నిఖార్సయిన తెలంగాణవాది మరణవార్త తనను ఎంతగానో కలిచివేసిందని తెలిపారు. స్వేచ్ఛ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ విషాదసమయంలో ఆమె కుటుంబసభ్యులకు, ముఖ్యంగా ఆమె కుమార్తెకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఉజ్వల భవిష్యత్ గల జర్నలిస్ట్‌ను కోల్పోయాం: హరీశ్‌రావు
ఎంతో ఉజ్వల భవిష్యత్ కలిగిన జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆమె ఆత్మకు శాం తి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. స్వేచ్ఛ మృతిపై రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, దాసోజు శ్రవణ్‌కుమార్, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తదితరు లు సంతాపం ప్రకటించారు. స్వేచ్ఛ మృతిపై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్ ఆవేదన వ్యక్తంచేశారు. స్వేచ్ఛ అంత్యక్రియల్లో టీయూడబ్ల్యూజే నేతలు పాల్గొన్నారు.
స్వేచ్ఛ మరణం బాధాకరం: కేసీఆర్
తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్ స్వేచ్ఛ వోటార్కర్ మరణం బాధాకరమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సామాజిక స్పృహ కలిగిన జర్నలిస్టుగా, కవయిత్రిగా ఎదుగుతున్న క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవి తెలంగాణ పోరాటంలో కీలక భూమిక పోషించారని గుర్తుచేశారు. శోకతప్పులైన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.