హైదరాబాద్, జూన్17 (నమస్తే తెలంగాణ): విలేజ్ డెవలప్మెంట్ కమిటీ (వీడీసీ)ల పేరిట అరాచకాలు, అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. గ్రామాల్లో కులవృత్తిదారులు, బలహీనవర్గాలపైన వీడీసీల పేరిట దాడులు, సాంఘిక బహిషరణలకు పాల్పడుతున్నాయని. వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, వీడీసీ వ్యతిరేక పోరాట కమిటీ శ్రీధర్ భట్టు, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ మంగళవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్మూర్, బాలొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో వీడీసీల అరాచకాలు ఎక్కువయ్యాయని ఆయనకు వివరించారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ, గంగపుత్ర, రజక, నాయీ బ్రాహ్మణ, యాదవ, ఆరె కటిక, ముదిరాజ్ కులాలపై వీడీసీలు దాష్టీకాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. వీడీసీలతో సమావేశమై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.