షరతుల్లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలకేంద్రంలోని కుమ్రంభీం చౌరస్తాలో అఖిలపక్షం, తుడుందెబ్బ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ సునీల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ సారా రమేశ్ గౌడ్, బీజేపీ మండలాధ్యక్షుడు పులి వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెడ్మ భగవంతరావు, రైతులు పాల్గొన్నారు.
షరతుల్లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో జనగామ జిల్లా చిల్పూరు తహసీల్ ఎదుట రైతులు ధర్నా చేశారు. అనంతరం జూనియర్ అసిస్టెంట్ మహేశ్వరికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి రమేశ్, సంపత్, రాజు, శ్రీనివాస్, రవి, మల్లయ్య, భీమయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు.
మాకెప్పుడు రుణమాఫీ అంటూ నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎస్బీఐ ఎదుట రైతులు శుక్రవారం నిరసన తెలిపారు. రూ.2 లక్షలపైన రుణం ఉన్నవారు మిగిలిన డబ్బులు ఖాతాల్లో జమ చేయటానికి బ్యాంకుకు వెళ్తే.. అలాంటిదేమీలేదని బ్యాంకర్లు మాఫీపై సీఎంనే అడగాలని సమాధానమిస్తున్నారని వాపోయారు.
నా భార్యకు మహబూబాబాద్‌లోని ఇండియన్ బ్యాంకులో డ్వాక్రా గ్రూప్‌పై రూ. 60 వేలు అప్పు ఉంది. ఈ డబ్బులు కడితేనే నా పేరు మీద ఉన్న రుణమాఫీ అవుతుందని బ్యాంకు అధికారులు చెప్తాన్రు. లేకపోతే అందులోనే ఉన్న డబ్బులను డ్వాక్రా అప్పుకు కట్ చేస్త్తామంటున్నరు. పెట్టుబడి కోసం ఇచ్చిన డబ్బులను అట్లా చేయవద్దని చెప్పిన. ఇండియన్ బ్యాంకు అధికారులు ఒప్పుకోవడం లేదు. డ్వాక్రా రుణాలకు తరలించకుండా రుణ మాఫీ అయ్యేలా న్యాయం చేయాలె.