హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో మరోమారు రేవ్‌పార్టీ కలకలం రేపింది. తెలంగాణ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు శనివారం రాత్రి రేవ్‌పార్టీని భగ్నం చేశారు. ఆ పార్టీలో పట్టుబడిన టయోటా ఫార్చూనర్ కారు (ఏపీ 39ఎస్ఆర్ 0001) విషయం చర్చనీయాంశమైం ది. ఈ కారుపై గుంటూరు ఎంపీ స్టిక్కర్ అతికించి ఉంది. ఈ కారు గుంటూరుకు చెందిన ఓ టీడీపీ నాయకుడిదిగా ఎక్సైజ్ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. కారు నంబర్ ఆధారంగా ఆర్టీవో డొమైన్ నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఈ కారు గుంటూరుకు చెందిన అప్పికట్ల పాములు అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయింది. ఈయన ఓ యువ ఎంపీకి అత్యంత సన్నిహితుడని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. అయితే, ఈ కారులో ఎంపీ వచ్చారా? లేదంటే ఆయన అనుచరులు ఎవరైనా వచ్చారా? అన్నదానిపై ఎక్సైజ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ దాడిలో ఆరుగురు యువతులు, 9 మంది యువకులు పట్టుబడ్డారు. వారి నుంచి 2.080 కిలోల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్, 1.91 గ్రాముల చరస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నాలుగు కార్లు, 11 సెల్ ఫోన్లను సీజ్ చేశారు.
పరారీలో ఉన్నది ఎవరు?
కొండాపూర్‌లోని ఎస్వీ నిలయం అనే అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ జరుగుతున్నదన్న పక్కా సమాచారంతోనే దాడిచేసినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దాడి జరుగుతుండగా ముగ్గురు వ్యక్తులు తప్పించుకుని పరారయ్యారు. అనుమానిత వ్యక్తులుగా వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. విజయవాడ, గుంటూరు ప్రాంతానికి చెందిన వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లతో బడా బాబులను హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్టు ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. ఎంపీ స్టిక్కర్ కారుపై ఎక్సైజ్ ఎస్టీఎఫ్ ఈఎస్ ప్రదీప్‌రావును వివరణ కోరగా అలాంటి కారు పట్టుబడినట్టు తమ దృష్టికి రాలేదని చెప్పడం గమనార్హం.