కోటపల్లి, ఆగస్టు 10: మంచిర్యాల జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. మూగజీవాలైన ఎడ్లు పొలంలో మేశాయన్న ఆగ్రహం తో ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయాడు. పశువులా ప్రవర్తించి ఎడ్ల యజమానిపై క్రూరంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లాలోని కోటిపల్లి మండలం షట్పల్లికి చెందిన దళితుడు దుర్గం బాపు అనే వ్యక్తికి చెందిన ఎడ్లు గురువారం మధ్యాహ్నం అదే గ్రామానికి చెందిన సూరం రాంరెడ్డి పొలంలో మేశాయి. అది చూసిన రాంరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయాడు. మనిషినన్న విషయం మర్చిపోయి బాపును పట్టుకుని దుర్భాషలాడుతూ ఇంటి ముందు కట్టేసి విచక్షణ రహితంగా దాడిచేశాడు. తప్పయిందని, వదిలేయాలని కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు.
గమనించిన స్థానికులు బాపును అతడి బారి నుంచి విడిపించి కోటపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో రామగుండం పోలీస్ కమిషనరేట్లో జరుగుతున్న మీటింగ్లో ఉన్న ఎస్సై సురేశ్ సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. బాధితుడి ఫిర్యాదుతో రాంరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో బాపుపై దాడి జరగ్గా సాయంత్రం వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు. ఈ కేసు విషయంలో పోలీసులు స్పందించిన తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.