KTR | బీఆర్ఎస్ కార్యకర్త మల్లేశ్ హత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లిలో మల్లేశ్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మల్లేశ్ కుటుంబానికి రూ.5లక్షల చెక్కును అందజేశారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్త మల్లేశ్ హత్య సంఘటనపై కాల్ డాటా బయటపెట్టాలన్నారు.
డీజీపీ, ఎస్పీ నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించరాదన్నారు. గత పది ఏళ్ల తమ పాలనలో ఏనాడు భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు చోటివ్వలేదన్నారు. మల్లేశ్ కుటుంబానికి పార్టీ అండదండలు ఎప్పుడూ ఉంటాయన్నారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజ్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఉన్నారు.