హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్! అత్యంత ప్రధానమైన ఆర్థిక శాఖలో (Finance Department) కీలక అధికారి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహారశైలిపై కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ‘కీ’లక పోస్టులో ఉన్న ఆ ఉన్నతాధికారి మంత్రుల సిఫారసులను కూడా లెక్కచేయడం లేదనే ప్రచారం జరుగుతున్నది. ఫలితంగా వివిధ పథకాలు, పెండింగ్ బిల్లుల నిధుల విడుదలలో జాప్యం వల్ల క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివిధ శాఖల సహచర ఐఏఎస్ అధికారులు వాపోతున్నారు. మాజీ సర్పంచుల బిల్లులు, వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఫీల్ట్ అసిస్టెంట్ల వేతనాలు, గ్రామ కార్యదర్శులకు ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం కాకపోయినా ఎంతోకొంత విడుదల చేయాలని ఆయా శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమారకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో తమ శాఖలకు నిధులు విడుదలవుతాయని మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు, డైరెక్టర్లు ఆశించారు. కానీ, వారి ఆశలపై నీళ్లు చల్లుతూ సదరు అధికారి వారిని నెలల తరబడి తన చాంబర్ చుట్టూ తిప్పుకొంటున్నారనే ఆరోపణలున్నాయి.
డబ్బులు విడుదల కాకపోవడంతో కిందిస్థాయి నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకోలేని ఓ సీనియర్ మంత్రి..‘కార్యదర్శిగారూ.. మీరు ఆర్థికశాఖ వద్దకు వెళ్లి, కాస్త మన శాఖకు చెందిన పెండింగ్ బిల్లులు విడుదలయ్యేలా చూడండి’ అంటూ ఆదేశించారని సమాచారం. దానికి ఆ కార్యదర్శి..‘ఎన్నిసార్లు ఆర్థికశాఖ గడప తొకమంటారు. అకడ సాటి ఐఏఎస్ అని కూడా చూడటం లేదు. కనీస మర్యాద కూడా లేకుండా చూద్దాంలే, చేద్దాంలే అంటున్నారు. నాకూ ఆత్మాభిమానం ఉంటుందికదా? అందుకని నేను అకడికి వెళ్లలేను’ అంటూ తన అశక్తతను బయటపెట్టుకున్నట్టు సమాచారం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని శాఖలకు బిల్లుల టోకెన్లు వస్తున్నా అవి నెలల తరబడి టోకెన్లుగానే ఉంటున్నాయి. నగదుగా మారడం లేదు. గతంలో ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు (ప్రస్తుత సీఎస్ ) దగ్గర అదే శాఖలో పని చేసిన అనుభవం ఉండటంతో ఆయనను అకడి నుంచి కదిలించే ధైర్యం చేయట్లేదని అదే శాఖకు చెందిన ఓ సీనియర్ ఆఫీసర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో సదరు అధికారి వ్యవహారం సచివాలయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.