అశ్వారావుపేట, మే 15: బీఆర్ఎస్ కార్యకర్త నిర్బంధాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు చేసిన ఆందోళనతో పోలీసులు మెట్టు దిగారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి కార్యకర్తకు నిర్బంధం నుంచి విముక్తి కల్పించారు. నిర్బంధానికి కారకుడైన వ్యక్తిపై బుధవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గిగా నవీన్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సోమవారం తమ గ్రామ పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిల్చున్నాడు.
ఈ క్రమంలో అక్కడి కాంగ్రెస్ నాయకుడు ఆరేపల్లి సూరిబాబు సెల్‌ఫోన్‌తో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లబోయాడు. ఈ విషయాన్ని నవీన్ గమనించి అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు సమాచారమిచ్చాడు. దీంతో సూరిబాబు నుంచి కానిస్టేబుల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు ఆగ్రహించిన సూరిబాబు.. ‘నాపైనే కానిస్టేబుల్‌కు ఫిర్యాదు చేస్తావా? బయటకు రా నీ అంతు చూస్తా’ అంటూ కులం పేరుతో దూషిస్తూ బెదిరించాడు.
అతడి ఒత్తిడితో పోలీసులు మంగళవారం నవీన్‌ను స్టేషన్‌కు పిలిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే నిర్బంధించారు. అంతేకాదు.. సూరిబాబుపై నవీన్ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు వెంటనే స్టేషన్‌కు చేరుకుని నవీన్‌ను ఎందుకు నిర్బంధించాంటూ పోలీసులను ప్రశ్నించారు.
అయినా పోలీసుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వెంకటేశ్వర్లు.. గ్రామం నుంచి వచ్చిన ఆదివాసీలు, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి స్టేషన్ ఎదుట బైఠాయించారు. స్పందించిన పోలీసులు.. తాటితో చర్చలు జరిపారు. ఈ మేరకు నవీన్ ఫిర్యాదుపై ఎస్సై శివరామకృష్ణ బుధవారం అనంతారంలో విచారణ జరిపి కాంగ్రెస్ నాయకుడు సూరిబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు.