హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్లు, కెమిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎట్టకేలకు సోమవారం నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖతను వ్యక్తంచేసింది. దాదాపు 315 మందికి సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద నియామక ఉత్తర్వులను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేయన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి 4 నెలలు గడుస్తున్నా.. నియామకపత్రాలు ఇవ్వడం లేదంటూ ఇటీవలే విద్యుత్తుసౌధ వద్ద ఏఈ, కెమిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు.
ఈ మేరకు అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘నమస్తే తెలంగాణ’లో ‘సర్కార్‌ను నమ్మి నిరుద్యోగులైనం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ మేరకు దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థులకు నియామకపత్రాలను అందించేందుకు సిద్ధమైంది.
టీజీ జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్, కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకోసం 2023 అక్టోబర్ 4న జెన్కో నోటిఫికేషన్ జారీచేసింది. 339 ఏఈ, 60 కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి 2024 జూలై 14న రాత పరీక్ష నిర్వహించారు. ఫలితాలు ప్రకటించి 2024 సెప్టెంబర్ 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను పూర్తిచేశారు. ఐదేండ్లు పనిచేసేందుకు అధికారులు బాండ్ కూడా రాయించుకున్నారు. 15 రోజుల్లో నియామక ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. దీంతో చాలామంది అప్పటివరకు చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. నాలుగు నెలలు గడిచినా ప్రభుత్వం నియామకపత్రాలు ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగారు.