హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) ఫారెస్ట్‌లో అసలు ఎన్ని పులులు ఉన్నాయి? ఉన్నవాటిలో మగ పులులు ఎన్ని? ఆడ పులులు ఎన్ని? పులి పిల్లలు ఎన్ని? పెద్దవి ఎన్ని? ఏటీఆర్‌లో 18 పులులే ఉన్నాయా? 21 ఉన్నాయని మరికొందరూ.. 23 ఉన్నాయని ఇటీవల జాతీయ పులుల గణాంకాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఏటీఆర్‌లోని పులుల లెక్క తేల్చడంతోపాటు ఏటీఆర్ పరిధిలో ఉన్న పులులు ఏవి? అవి ఎలా ఉంటాయి? అనే విషయాలపై స్పష్టత ఇచ్చేందుకు అమ్రాబాద్ ఫారెస్ట్ అధికారులు పెద్ద కసరత్తు చేస్తున్నారు.
ఇందుకోసం ఏటీఆర్‌లోని పులులపై ప్రత్యేక ‘క్యాటలాగ్’ను అటవీశాఖ రూపొందిస్తున్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు తుది దశకు చేరింది. ఈ నెల 15న ఈ క్యాటలాగ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏటీఆర్ఎఫ్లో జంతువుల సంచారాన్ని తెలుసుకొనేందుకు ఏర్పాటు చేసిన కెమెరాల్లో నిక్షిప్తమైన చిత్రాల ఆధారంగా ఈ క్యాటలాగ్‌ను రూపొందిస్తున్నట్టు డీఎఫ్‌వో రోహిత్ గోపిడి తెలిపారు.