Electric Vehicles | హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): సంప్రదాయ ఇంధన వినియోగాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణ అనుకూలమైన రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) రంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈవీల కొనుగోళ్లను ప్రోత్సహించడంపై శ్రద్ధ చూపడంలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు నిలిచిపోవడంతో ఈవీలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపడంలేదు. రాష్ట్రంలో ఈవీల వినియోగానికి అవసరమైనన్ని చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోగా ఇప్పటికే ఏర్పాటు చేసిన స్టేషన్లలో 25 శాతం వరకు పనిచేయడం లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఈవీ పాలసీని ప్రవేశపెట్టి 2 లక్షల టూ వీలర్లు, 5 వేల కార్లు, 20 వేల ఆటోలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. మొదటి దశలోనే 500 చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు మరో 3 వేలకుపైగా స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ప్రోత్సాహకాలను పొడిగించాలని నిర్ణయించింది. కానీ, ఇప్పుడు ఈవీ కొనుగోలుదారుల నుంచి ఆర్టీఏ అధికారులు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో పెట్రోల్, డీజిల్ వాహనాలకు, ఈవీలకు తేడా లేకుండా పోయింది. దీంతో ఈవీల కొనుగోలుకు జనం ఆసక్తి చూపడం లేదు. పెట్రోల్ వాహనాలతో పోల్చుకుంటే ఈవీల ధరలు అధికంగా ఉండటంతో మళ్లీ సాంప్రదాయ ఇంధన వాహనాలవైపే మొగ్గు చూపుతున్నారు.’
కేరళ కంటే తక్కువ విక్రయాలు
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో ఈవీ విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 1.6 కోట్ల వాహనాల్లో ఈవీలు కేవలం 0.8 శాతమే ఉన్నట్టు ఎఫ్టీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో కంటే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ర్టాల్లో ఈవీ విక్రయాలు అధికంగా ఉన్నట్టు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈవీలపై బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన రాయితీలను పునరుద్ధరించాలని, చార్జింగ్ కేంద్రాలను పెంచి వాటి నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని వాహనరంగ నిపుణులు కోరుతున్నారు.
5 రాష్ర్టాల్లోనే 50% విక్రయాలు
గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశవాప్తంగా మొత్తం 41.35 లక్షల ఈవీలను విక్రయించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో 17 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇందులో టూవీలర్లు 55%, ఆటోలు 32% ఉన్నాయి. మొత్తం విక్రయాల్లో 50% ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ రాష్ర్టాల్లోనే జరగడం విశేషం. 2022-23తో పోల్చుకుంటే గత ఆర్థిక సంవత్సరంలో ఈవీల విక్రయాలు 28% వృద్ధి చెందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతకన్నా ఎక్కువ వృద్ధి నమోదయ్యే అవకాశమున్నదని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.