నిజామాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పార్టీ సిద్ధాంతాలు, నీతి, నియమాలంటూ నీతులు చెప్పే బీజేపీకి.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం నిజామాబాద్ పర్యటన ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తున్నది. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అత్యుత్సాహం, బీజేపీ రాష్ట్ర నాయకత్వం అవగాహన లేమితో నిజామాబాద్‌లో నిర్వహించిన రెండు కార్యక్రమాలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అమిత్‌షా చాలా రోజుల తర్వాత తెలంగాణ పర్యటనకు వచ్చారు. నిజామాబాద్ జిల్లాలో రెండు కార్యక్రమాలకు అమిత్‌షా హాజరయ్యారు. పర్యటనలో భాగంగా జాతీయ పసుపు బోర్డు తాత్కాలిక కార్యాలయంతోపాటు, స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ తండ్రి, మాజీ మంత్రి డీ శ్రీనివాస్ (డీఎస్) విగ్రహాన్ని ఆవిష్కరించారు.
వీటిపై సోషల్ మీడియాతోపాటు స్థానిక ప్రజల్లో భిన్నమైన చర్చ నడుస్తున్నది. వాస్తవానికి ఆరు నెలల క్రితమే జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. తాజాగా ఆదివారం డీఎస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా.. అదే జాతీయ పసుపు బోర్డును తాత్కాలిక కార్యాలయం పేరుతో అమిత్‌షా ప్రారంభించడంపై పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అంతేకాకుండా, జీవితాంతం బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా పనిచేసిన డీ శ్రీనివాస్ విగ్రహాన్ని అమిత్‌షా ఆవిష్కరించడంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. మరోవైపు పాలిటెక్నిక్ మైదానంలో అమిత్‌షా నిర్వహించిన కిసాన్ సమ్మేళనం సభకు ప్రజలు తక్కువ సంఖ్యలోనే వచ్చారు. వెనుక భాగంలో వేసిన కుర్చీలు ఖాళీగా కనిపించాయి.
కేంద్ర మంత్రిని తప్పుదోవ పట్టించారా?
బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికలు జూలై 1న నిర్వహించనున్నారు. అధ్యక్ష పదవి కోసం అర్వింద్ సైతం పోటీపడుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అమిత్‌షాను మచ్చిక చేసుకునేందుకు వ్యూహం పన్నిన ఎంపీ అర్వింద్.. కేంద్ర హోం శాఖ మంత్రి స్థాయి వ్యక్తిని చులకన చేసేలా కార్యక్రమాలకు రూపకల్పన చేశారంటూ సీనియర్లు రగిలిపోతున్నారు. ఈ మేరకు కేంద్ర అధినాయకత్వానికి ఫిర్యాదులు చేసినట్టు బీజేపీ నేతలే చెప్పుకుంటున్నారు. కనీస మద్దతు ధరను కల్పించకుండా పసుపు బోర్డుతో ఎలాంటి ప్రయోజనాలు ఉండవని రైతులు చర్చించుకున్నారు.
డీఎస్ విగ్రహావిష్కరణకు దూరంగా ధర్మపురి సంజయ్
జాతీయ పసుపు బోర్డు తాత్కాలిక కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో అమిత్‌షాతోపాటు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి ఏ ఒక్కరూ విగ్రహావిష్కరణకు రాలేదు. చివరకు డీఎస్ పెద్ద కుమారుడు, మాజీ మేయర్, కాంగ్రెస్ నేత ధర్మపురి సంజయ్ సైతం హాజరుకాలేదు.
బోసిపోయిన డీఎస్ నివాసం!
నిజామాబాద్‌లోని డీ శ్రీనివాస్ ఇల్లు తెలియని వారుండరు. ఒకప్పుడు జిల్లా రాజకీయాలకు ఆ ఇల్లు కేంద్రం. అనుచరులు, అభిమానులతో కళకళలాడేది. ఇప్పటికీ డీ శ్రీనివాస్ పేరిటనే నేమ్ బోర్డు ఉంది. రాజ్యసభ సభ్యుడిగా అందులో పేర్కొన్నారు. ఆ నివాసాన్ని ఎవరూ పట్టించుకోలేదు.