హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలని, డిగ్రీ స్థాయిలో పరిశోధనలపై ఆసక్తి పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం విభిన్న కార్యక్రమాలు రూపొందించడం అభినందనీయమని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టోలెడో, కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మాస్యూటికల్స్ ప్రొఫెసర్ ఫ్రెడరిక్ విలియం అన్నారు. భారత్లో సాధారణంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) తర్వాత పరిశోధనలపై దృష్టి సారిస్తారని, ఇందుకు భిన్నంగా గురుకుల విద్యాలయాల విద్యార్థులకు ఆసక్తి పెంచేలా కార్యక్రమాలు రూపొందించటం గొప్ప పరిణామమని ప్రశంసించారు.
రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా శాంతివనంలో మూడురోజులపాటు నిర్వహించే సదస్సులో భాగంగా బుధవారం ‘అడ్వాన్సెస్ ఇన్ బయాలజీ అండ్ మెడిసిన్’ (బయోమి-23)పై ఆయన కీలకోపన్యాసం చేశారు. మానవ వ్యాధులకు జన్యుపరమైన అంశాలు, నివారణ అన్న అంశాలపై ప్రసంగించారు. ఆయా చికిత్సలు, వైద్య పరికరాలపై పలువురు నిపుణులు ప్రసంగించారు. ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల నుంచి 14 మంది వక్తలు, 750 మంది విద్యార్థులు హాజరయ్యారు.