హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌లో తన డాటా సెంటర్‌ను విస్తరించేందుకు ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కంపెనీ వెబ్ సర్వీసెస్ డాటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, కంపెనీ ప్రతినిధులు ఆదివారం సమావేశమయ్యారు. తెలంగాణలో డాటా సెంటర్ కార్యకలాపాలపై చర్చించారు. కాగా బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణలో అమెజాన్ కంపెనీ కార్యకలాపాలను భారీగా విస్తరించింది. ప్రపంచంలోనే అమెజాన్‌కు చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్న విషయం విదితమే. గతేడాది అమెజాన్ డెడికేటెడ్ ఎయిర్ కార్గో నెట్వర్ ‘అమెజాన్ ఎయిర్’ను ప్రారంభించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు సంబంధించి హైదరాబాద్‌లో మూడు డాటా సెంటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ సేల్ డాటా సెంటర్‌తో తమ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలను కంపెనీ ప్రతినిధులు మంత్రితో పంచుకున్నారు.
అమెజాన్‌తో చర్చలు విజయవంతమ య్యాయని మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. ప్రభుత్వం తరఫున తగిన సహకారంతోపాటు ఉత్తమ ప్రోత్సాహకాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చినట్టు చెప్పారు.