కొల్లాపూర్: రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటు కోతలు (Power Cut) లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు వట్టి కోతలేనని మరోసారి రుజువైంది. ఏకంగా సీఎం (CM Revanth Reddy) సొంత జిల్లాలోని ఓ తండా మూడు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. కరెంటు వచ్చేవరకు ఓటేసేది లేదని ఆందోళనకు దిగారు. దీంతో ఓటర్లు లేకపోవడంతో ఆ ఊర్లోని పోలింగ్ కేంద్రంలో అధికారులు ఖాళీగా ఉండిపోయారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడెంలో మూడు రోజులుగా కరెంటు లేకపోవడంతో గ్రామస్థులు ఓట్లు వేయకుండా ఆందోళనకు దిగారు. గత మూడు రోజుల నుంచి కరెంట్ లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము చెంచులమన్న ఉద్దేశంతోనే ఎవరూ ఇటువైకూడా రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం, మంచినీటి వసతి, రేషన్ కార్డులు లాంటి సమస్యలు ఉన్నా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. నల్లమల ప్రాంతం కావడంతో పాములు వస్తున్నాయని, కరెంట్ లేకపోవడంతో పాము కాటుకు గురి కావాల్సివస్తుందని తెలిపారు. విద్యుత్ అధికారులు కరెంటు బిల్లులు అడుగుతారు కాని, కరెంటు మాత్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, గ్రామస్థులు ఓట్లను బహిష్కరించడంతో పోలింగ్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో విద్యుత్ సిబ్బంది హుటాహుటిన చెంచు గూడెంకు చేరుకున్నారు.