ములుగురూరల్, అక్టోబర్ 26: ములుగు జిల్లా ములుగు మండలం ఇంచర్ల శివారులో హార్టికల్చర్ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 11 గంటల మధ్య పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు తొలగించారు. సర్వే నంబర్ 17లో మొత్తం 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. మూడు ఎకరాల స్థలంలో కొన్ని పార్టీల ఆధ్వర్యంలో పేదలు 37 గుడిసెలను వేసుకున్నారు. ఈ గుడిసెల్లో సెంటు భూమి లేని వారు కొందరు నివాసముంటుండగా, మరికొందరు ఇండ్లు ఉన్న వారు ఉన్నారు. గతంలో ప్రభుత్వ అవసరాల నిమిత్తం స్థలాన్ని ఖాళీ చేయాలని అధికారులు తెలియజేసినప్పటికీ గుడిసెవాసులు ఖాళీ చేయలేదు. తాజాగా ములుగు ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్ విజయ్‌భాస్కర్, డీఎస్పీ రవీందర్, ములుగు, వెంకటాపురం (నూగూరు) సీఐలుశంకర్, బండారి కుమార్, ములుగు, వెంకటాపూర్, తాడ్వాయి, ఎస్సైలు వెంకటేశ్వర్రావు, రామకృష్ణ, సతీశ్, శ్రీకాంత్‌రెడ్డి సిబ్బందితో గుడిసెల వద్దకు చేరుకున్నారు.
గుడిసెల్లోని సామగ్రిని ఒక్కొక్కటిగా బయట వేసి, మూడు జేసీబీలు, నాలుగు ట్రాక్టర్ల సహాయంతో గుడిసెలను తొలగించారు. మంగపేట మండలంలోని తిమ్మంపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వెంకటాపూర్ మండలంలోని పెద్దాపూర్, పాలంపేట, నారాయణపూర్, తాడ్వా యి మండలంలోని కామారం గ్రామాలకు చెందిన ప్రజల సామగ్రిని పోలీసులు ప్రత్యేక వాహనాల్లో ఎక్కించి వారి వారి మండలాలకు తరలించారు. కాగా.. హార్టికల్చర్ భూ ముల పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించేందుకు ఇటీవల మంత్రి సీతక్క భూమి పూజ చేశారు. ఈ పాఠశాలకు అనుసంధానంగా స్పోర్ట్స్ స్కూల్ ను నిర్మించేందుకు హారికల్చర్ భూమిని కొన్ని రోజుల క్రితం అధికారులు పరిశీలించారు. ఇందులో భాగంగా అక్రమంగా వేసిన గుడిసెలను తొలగించి జేసీబీల సాయంతో కందకాలు తీశారు. సెప్టెంబర్ 24న గుడిసె వాసులందరికీ షోకాజ్ నోటీసులు అందించారు. గడువు లోగా వారు గుడిసెలను తొలగించనందున శనివారం గుడిసెలను తొలగించినట్టు ములుగు తహసీల్దార్ తెలిపారు.