Pharmacists | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఆయూష్ (ఆయుర్వేద, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి)లో ఫార్మాసిస్టు ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి 28న తీసుకొచ్చిన జీవో-65 కాంట్రాక్టు ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టేదిగా మారింది. 18 ఏండ్లుగా ఆయూష్‌లో పనిచేస్తున్న 337 మంది కాంట్రాక్టు ఫార్మాసిస్టులను కాదని ఈ ఉద్యోగానికి అల్లోపతి(ఇంగ్లిష్ మెడిసిన్)లో డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మ్-డీ చదివిన వారిని అర్హులుగా పేర్కొంటూ, ప్రభుత్వం జీవో జారీ చేయడం వివాదాస్పదమవుతున్నది. వీరిలో ఎంపికైన వారికి ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సును ప్రభుత్వ ఆయుర్వేద, యునాని, హోమియో కాలేజీల్లో ఇవ్వాలని నిర్ణయించింది.
శిక్షణ సమయంలో నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా తుది నియామకం ఉంటుందని తెలిపింది. అయితే, ఆయూష్‌తో ఎలాంటి సంబంధం లేకున్నా అల్లోపతి చదవిన వారిని ఫార్మాసిస్టులుగా నియమించేందుకు జీవో జారీ చేయడం ఏమిటని కాంట్రాక్టు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇన్నేండ్ల అనుభవం ఉన్న తమనే రెగ్యులరైజ్ చేస్తే ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సును పూర్తిచేస్తామని కాంట్రాక్టు ఫార్మాసిస్టులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్లో ‘ఆయూష్ డిప్లొమా ఇన్ ఫార్మాసిస్టు’ కోర్సును కనీస విద్యార్హతగా పేర్కొన్నది.
కాగా, రాష్ట్రంలో ఏ విద్యాసంస్థలోనూ ఈ కోర్సు లేదు. ఆ కోర్సు చదివిన అభ్యర్థులు అసలే లేరు. అయినా ప్రభుత్వం 308 పోస్టుల నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతోపాటు గత సంవత్సరం సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసి, నవంబర్‌లో పరీక్ష నిర్వహిస్తామని జాబ్ క్యాలెండర్లో తెలిపింది. అధికారుల నిర్వాకంతో రాష్ట్రంలో లేని కోర్సును అర్హతగా పేర్కొంటూ ప్రభుత్వం ఆయూష్‌లో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం పట్ల నిరుద్యోగుల నుంచి నాడు ఆందోళన వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం ఆయూష్ ఫార్మాసిస్టు పోస్టులను మినహాయించి అల్లోపతిలో 633 ఫార్మాసిస్టు పోస్టుల భర్తీకి గత ఏడాది సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో ‘ఆయూష్ డిప్లొమా ఇన్ ఫార్మాసిస్టు’ నిబంధన పెట్టిన ప్రభుత్వమే తాజాగా అల్లోపతి చదివిన వారికి అవకాశం కల్పించడం ఏమిటని కాంట్రాక్టు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఆయూష్‌లో ఫార్మాసిస్టు పోస్టుల భర్తీ కోసం ఆరు నెలల పాటు థియరీ, ఆరు నెలలు ప్రాక్టికల్ అనుభవంతో కూడిన ఇన్ సర్వీస్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి పరీక్ష నిర్వహించి శిక్షణ, సర్టిఫికెట్ జారీ చేసే నిబంధన మాత్రమే రాష్ట్రంలో అమలులో ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయూష్ ఫార్మాసిస్టు పోస్టుకు రెండేండ్ల కాల వ్యవధి గల డిప్లొమా ఇన్ ఆయూష్ కోర్సును కనీస విద్యార్హతగా పేర్కొంటూ 2017లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం జీవో-147 జారీ చేసింది. అనంతరం ఆయూష్‌లో ఫార్మాసిస్టు పోస్టుల భర్తీ కోసం 2022లో కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీ బాధ్యతను తొలుత టీఎస్పీఎస్సీకి అప్పగించినప్పటికి, తదనంతర పరిణామాల కారణంగా హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డుకు అప్పగించారు. అయితే ఈ కోర్సు రాష్ట్రంలోనే లేదనే విషయాన్ని సంబంధిత శాఖ అధికారులు ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయూష్‌లో ఫార్మసీ ఇన్ డిప్లొమా చదివిన అభ్యర్థులు లేని కారణంగా రాష్ట్రంలో పలు దవాఖానాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఫార్మాసిస్టులకు శిక్షణ ఇచ్చి అర్హులుగా గుర్తించాలని హరీశ్‌రావు ఆదేశాలు ఇచ్చారు. అయితే నాడు ఉన్నతాధికారుల తాత్సారం, అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈ అంశం మరుగునపడింది.
తమ గోడు చెప్పుకొనేందుకు ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా ఎవరూ స్పందించడం లేదని కాంట్రాక్టు ఫార్మాసిస్టులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్వీసులో వెయిటేజీ వస్తుందన్న ఆశతో తాము కొవిడ్‌లో సైతం అల్లోపతి వైద్యానికి సహకారం అందించామని తెలిపారు. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ గైడ్‌లైన్స్ ప్రకారం (ఎన్సీఐఎస్ఎం) ఆయూష్ మందులు తయారు చేస్తారని, ఆ విషయాన్ని పక్కనబెట్టి అల్లోపతి చదవిన వారికి ఆయూష్‌లో ఫార్మాసిస్టులుగా ఎలా అవకాశం కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఫార్మాసిస్టు పోస్టుల భర్తీ కోసం నిర్దేశించిన విద్యార్హత తమకు శాపంలా మారిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం జారీ చేసిన జీవో-65ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం తమకు రాత పరీక్షలకు అయినా ఎలిజిబుల్‌గా ప్రకటించాలని, ఈ విద్యార్హత నిబంధన నుంచి తమను మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేని పక్షంలో ఏండ్లుగా ఆయూష్‌లో కాంట్రాక్టు ఫార్మాసిస్టులుగా పనిచేస్తున్న 337 మంది, వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
2008లో ఇంటర్లో సైన్స్ సబ్జెక్టు చదివిన వారిని మెరిట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీతో అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించారు. వరుసగా పలు దఫాల్లో ఈ ఎంపిక ప్రక్రియ సాగగా.. 337 మంది కాంట్రాక్టు ఫార్మాసిస్టులుగా కొనసాగుతున్నారు. తొలుత వీరిని కాంపౌండర్లుగా పిలిచేవారు. తర్వాత వీరిని ఫార్మాసిస్టులుగా మార్చారు. అయితే చివరిసారిగా ఆయూష్‌లో 1991లో ప్రభుత్వం ఫార్మాసిస్టు రెగ్యులర్ పోస్టులను భర్తీ చేసింది.
ఇక ఆయూష్ సేవలు ఆయా రాష్ర్టాల్లో మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దీని కోసం మంత్రిత్వ శాఖను సైతం ఏర్పాటు చేసింది. ఏపీలో సైతం ఆయూష్‌లో కాంట్రాక్టు ఫార్మాసిస్టులుగా పనిచేస్తున్న వారి సేవలను గుర్తించి మూడేండ్ల క్రితం రెగ్యులరైజ్ చేశారు. రాష్ట్రంలో మాత్రం ఆయూష్‌లో 18 ఏండ్లుగా పనిచేస్తున వారిని కాదని, అల్లోపతి చదివిన వారిని నియమిస్తే ఆయూష్ లక్ష్యం నెరవేరుతుందా..? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది.