శంషాబాద్ రూరల్, ఆగస్టు 24 : సాంకేతికలోపం కారణంగా అలయన్స్ ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేపై నిలిచిన ఘటన ఆదివారం జరిగింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 8 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతి వెళ్తున్న విమానం రన్‌వే పైకి వెళ్లిన సమయంలో సాంకేతికలోపం రావడంతో తిరిగి వెనక్కి వచ్చింది. మరోసారి విమానం రన్‌వే పైకి వెళ్లిన తర్వాత సాంకేతిక లోపంతో గాల్లోకి ఎగరలేకపోయింది. ముచ్చటగా మూడోసారి కూడా రన్‌వే పైకి వచ్చిన విమానం టేకాఫ్ చేసిన తర్వాత గాల్లోకి ఎగరలేకపోయింది.
దీంతో విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్టు గుర్తించిన పైలట్ విమానం వెళ్లడం కష్టమని ఎయిర్‌లైన్స్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విమానంలో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇటీవల తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్న అలయన్స్ ఎయిర్‌లైన్స్ అధికారులు విమానంలో సాంకేతికలోపం గుర్తించకపోవడంతో గంటల తరబడి రన్‌వేపై నిలబడాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.