జైళ్లశాఖలో కన్సల్టెన్సీ జీఎస్టీ మాయ?
తెలంగాణ జైళ్లశాఖలో జీఎస్టీ పేరిట ఓ కుంభకోణానికి తెరతీసినట్టు తాజాగా తెలియవచ్చింది. జైళ్లశాఖలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 500 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను అడ్డం పెట్టుకొని.. ఓ కన్సల్టెన్సీ జీఎస్టీ స్కెచ్ వేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
- ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కొత్తగా కన్సల్టెన్సీకే జీఎస్టీ!
- ఓపెన్ టెండర్లు లేకుండానే 500 మంది బాధ్యతలు అప్పగింత
- కన్సల్టెన్సీ నిర్వాహకుడు కూడా జైళ్లశాఖ ఆడిటరేనా!?
- జైళ్లశాఖ ఉన్నతాధికారుల పాత్రపై అనుమానాలు
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జైళ్లశాఖలో జీఎస్టీ పేరిట ఓ కుంభకోణానికి తెరతీసినట్టు తాజాగా తెలియవచ్చింది. జైళ్లశాఖలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 500 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను అడ్డం పెట్టుకొని.. ఓ కన్సల్టెన్సీ జీఎస్టీ స్కెచ్ వేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జైళ్లశాఖలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెలా రూ.15వేల నుంచి రూ.30 వేల వరకూ వేతనం చెల్లిస్తున్నారు.
కొన్ని నెలల క్రితం ఈ 500 మందిని ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఓ కన్సల్టెన్సీ కింద ఎన్రోల్ అయ్యారు. ఆ కన్సల్టెన్సీ నుంచే తెలంగాణ జైళ్లశాఖకు అవసరాన్ని బట్టి.. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పంపించాలనేది ఒప్పందం. అయితే కన్సల్టెన్సీ కోసం ఎలాంటి టెండర్లు పిలవకుండానే ఉన్నతాధికారులు ఈ కంపెనీని ఎంపిక చేసినట్టు తెలిసింది. దాదాపు 500 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతభత్యాల బాధ్యత, సంస్థ చెల్లించాల్సిన జీఎస్టీని సైతం జైళ్లశాఖ ఆ కంపెనీ చేతుల్లోనే పెట్టింది.
కాస్ట్ టు కంపెనీ విధానంలో చెల్లింపులు..
జైళ్లశాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కాస్ట్ టు కంపెనీ (సీటీసీ) విధానంలో ఆరు శ్లాబుల్లో వేతనాలు నిర్ణయించారు. ఒక ఉద్యోగి వేతనం రూ.15 వేలు ఉంటే.. ఆ వేతనం కలుపుకొని అందుకు నెలవారీ సీటీసీ రూ.19,647గా నిర్ణయించారు. దీనిపై రూ.373 నిర్వహణ రుసుము కలిపితే ఇన్వాయిస్ విలువ రూ.20,020 అవుతుంది. దీనికి రూ.3,604 జీఎస్టీ జతచేస్తే.. ఆ ఉద్యోగికి చెల్లించాల్సిన మొత్తం రూ.23,624 అవుతుంది. అదేవిధంగా రూ.20 వేల టేక్హోమ్ జీతానికి మొత్తం చెల్లింపు రూ.29,937గా, రూ.30 వేల జీతానికి రూ.41,006గా ప్రతిపాదించారు. ఉద్యోగి జీతంలోంచి కట్ చేయకూడదనేది నిబంధన. దీనికితోడు సదరు కన్సల్టెన్సీ ఒక్కో ఉద్యోగి వేతనం నిర్వహణ కింద 1.9 శాతం కమిషన్ వసూలు చేస్తున్నది.
ఆ కంపెనీకి జీఎస్టీ చెల్లించి మరీ…
కొంతకాలం వరకు ఎలాంటి కన్సల్టెన్సీ లేకుండానే జైళ్లశాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించింది. ఇప్పుడు ఉన్నపళంగా కొత్తగా కన్సల్టెన్సీ తీసుకురావల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ కన్సల్టెన్సీకి ఒక్కో ఉద్యోగి సీటీసీ నుంచి ప్రతినెలా శ్లాబుల వారీగా రూ.3,604 నుంచి రూ.6,255 ఎందుకు చెల్లించాల్సి వస్తుందనేది జైళ్లశాఖ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న. ఆ కన్సల్టెన్సీ ప్రతినెలా జీఎస్టీని చెల్లిస్తుందా? లేదా? అనేది కూడా అనుమానంగా ఉందని అంటున్నారు.
ఒకవేళ ఆ సంస్థ జీఎస్టీ చెల్లించకపోతే లక్షల్లో వెనకేసుకున్నట్టేనని అంటున్నారు. ఎలాంటి కంపెనీ నేపథ్యంలేని ఒక కన్సల్టెన్సీకి ఓపెన్ టెండర్ లేకుండా.. ఇన్ని బాధ్యతలు ఎలా అప్పగించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, తెలంగాణ జైళ్లశాఖలో నిర్వహిస్తున్న బంకులను ఆడిట్ చేసే ఓ చార్టెడ్ అకౌంటెండ్ (సీఏ)తో ఆ కన్సల్టెన్సీ పెట్టించారనేది జైళ్లశాఖ వర్గాలు కోడైకూస్తున్నాయి. ఆ కన్సెల్టెన్సీ పెట్టించేలా ప్రోత్సహించిన ఆ ఉన్నతాధికారులు ఎవరనేది మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు. ఆ కంపెనీ వెనుక ఆడిటరే ఉన్నారా? లేక మరెవరైనా ఉన్నారా? అనేది సీఎంవో, హోంశాఖ ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

