సర్కార్ భూములపై గద్దల్లా పెద్దలు
శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పరిధిలోని సర్వే నంబర్ 66/2లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
- రాయదుర్గంలో వందల కోట్ల ప్రభుత్వ భూములు కబ్జా!
- సర్వే నంబర్ 66/2లోని 20 ఎకరాలపై బడాబాబుల కన్ను
- రాత్రికి రాత్రే షెడ్ల నిర్మాణం, ప్లాట్ల పేరుతో కొండల చదును
- బారికేడ్లు, బుల్డోజర్లు, ప్రైవేట్ సైన్యంతో హడావుడి
- స్పందించని రెవెన్యూ అధికారులు, పోలీసులు, ప్రభుత్వం
ఎక్కడ సర్కార్ భూములు ఉంటే అక్కడ అధికార పార్టీ అండతో పెద్దలు గద్దల్లా వాలిపోతున్నారు. రాత్రికి రాత్రే కొందరు భారీ షెడ్లు, కంచెలు వేసి.. మరికొందరు బుల్డోజర్లతో కొండలను పిండి చేస్తూ భూములను చెరబడుతున్నారు. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పరిధిలోని సర్వే నంబర్ 66/2లో మిగులుగా ఉన్న రూ.వందల కోట్ల విలువ చేసే 20 ఎకరాలపై కన్నేసి యథేచ్ఛగా ఆక్రమణ పనులు మొదలుపెట్టారు.
శేరిలింగంపల్లి, అక్టోబర్ 24: అక్రమార్కులు బరితెగించారు. ఏకంగా రూ.వందల కోట్ల భూముల కబ్జాకు తెగబడ్డారు. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పరిధిలోని సర్వే నంబర్ 66/2లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రశాంతి హిల్స్ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఈ మిగులు భూములపై అక్రమార్కులు కన్నేశారు. ఓవైపు రాత్రికి రాత్రే భారీ షెడ్లు, ఫెన్సింగ్‌లు ఏర్పాటుచేస్తుండగా, మరోవైపు తమ ప్లాట్లంటూ కొందరు భారీ జేసీబీలతో కొండలను పిండి చేస్తూ చదును చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎక్కడున్నారు? ఆక్రమణలపై ఎందుకు స్పందించడం లేదు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దాదాపు 20 ఎకరాల మిగులు భూములు
సర్వే నంబర్ 66/2లో మొత్తం సుమారు 45 ఎకరాలు ఉన్నది. ఇందులోని సుమారు 25 ఎకరాల్లో నాగహిల్స్ ఏర్పాటైంది. మిగిలిన సుమారు 20 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. రూ.వందల కోట్లు విలువ చేసే ఈ భూములపై ఇప్పుడు అక్రమార్కుల కన్ను పడింది. కొన్ని రోజులుగా క్రమంగా ఆక్రమించడం మొదలు పెట్టారు. ఒకవైపు రాత్రికి రాత్రే భారీ షెడ్లు, ఇనుప ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణాలు కూడా చేపడుతున్నారు.
మరోవైపు తమ ప్లాట్లంటూ కొందరు భారీ జేసీబీలు, హిటాచీలతో పెద్ద పెద్ద కొండలను తవ్వి చదును చేస్తున్నారు. అంతేకాదు ఆ భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు బారికేడ్లు ఏర్పాటుచేసి, కాపలా కోసం ప్రైవేట్ వ్యక్తులను నియమిస్తున్నారు. ఇలా ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న విలువైన భూముల వద్ద అకస్మాత్తుగా బారికేడ్లు, ఫెన్సింగ్‌లు వెలుస్తుండడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భూములకు సంబంధించిన పత్రాలు ఎవరి వద్ద ఉన్నాయి? ప్రభుత్వ భూములైతే ప్రైవేట్ వ్యక్తులు ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నారు? అనే ప్రశ్నలు వారిలో తలెత్తుతున్నాయి.
తెరవెనుక బడాబాబులు.. ప్రేక్షక పాత్రలో అధికారులు
అత్యంత విలువైన భూముల్లో యంత్రాలతో తవ్వకాలు, చదును చేస్తున్నా, ఫెన్సింగ్ వేస్తున్నా, నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదన్నారు. ఈ వ్యవహారం వెనుక కొందరు ప్రభుత్వ పెద్దలు, స్థానిక నేతల హస్తం ఉన్నదని ఆరోపిస్తున్నారు.
అందుకే అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆక్రమణలు పూర్తయిన తర్వాత స్పందించడం కన్నా, ముందుగానే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రెవెన్యూ, సర్వే విభాగాల అధికారులు సంయుక్తంగా క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టి, సర్వే నంబర్ 66/2లోని భూముల వాస్తవ విస్తీర్ణం, యాజమాన్య హక్కులు, ప్రస్తుత ఆక్రమణలపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వ భూముల్లో అక్రమంగా షెడ్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్టు తేలితే వాటిని తొలగించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై శేరిలింగంపల్లి తాసిల్దార్ మహిపాల్ రెడ్డి వివరణ కోరగా.. 66/2లో గతంలో నాగహిల్స్కు చెందిన ప్లాట్లు ఉన్నాయని సర్వేయర్ రిపోర్టు ఇచ్చినట్టు తెలిపారు. దాని ఆధారంగా కొందరు ప్లాట్ల నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. రాత్రికి రాత్రి వేసిన షెడ్లు తమ దృష్టికి రాలేదని, వాటిని పరిశీలించి చర్యలు చేపడుతామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

