మరో టెండరూ ఆ మంత్రి కంపెనీకే!
సాగునీటి ప్రాజెక్టు అందులోనూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంటే.. విస్తృతమైన ప్రజాప్రయోజనం కల్పించాలి. లక్ష్యం మేరకు నీళ్లను తరలించి పసిడి పంటలు పండించగలగాలి. రైతుల కండ్లల్లో ఆనందం నింపాలి. అవసరమైతే తాగునీటితోపాటు పారిశ్రామికంగానూ అవసరాలు తీర్చగలగాలి.
- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని సొంతానికి వాడుకుంటున్న నేతలు
- ప్రాజెక్టులో ముఖ్యనేత, నంబర్-2 మంత్రి కలిసి కాసులవేట
- అంచనా వ్యయం 5 రెట్లు పెంపు, టెండర్ నిబంధనల్లో మార్పు
- చుక్కనీరు రాకముందే 1,450 కోట్ల నుంచి 6,825 కోట్లకు అంచనా పెంపు
- కీలక మంత్రి కంపెనీకి మొన్న తొలి టెండర్, ఇప్పుడు మరో టెండర్
- అనుమానం రాకుండా రేసులో డమ్మీ కంపెనీలను చేర్చినట్టు ఆరోపణలు
- సంబంధిత శాఖ మంత్రి గరంగరం, సచివాలయంలో బుజ్జగింపుల పర్వం
- క్విడ్‌ప్రోకోతో ప్రజాధనం భారీగా లూటీ అవుతున్నదంటున్న నిపుణులు
- కొడంగల్ వ్యయాన్ని ఎత్తిపోశారిలా
సాగునీటి ప్రాజెక్టు అందులోనూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంటే.. విస్తృతమైన ప్రజాప్రయోజనం కల్పించాలి. లక్ష్యం మేరకు నీళ్లను తరలించి పసిడి పంటలు పండించగలగాలి. రైతుల కండ్లల్లో ఆనందం నింపాలి. అవసరమైతే తాగునీటితోపాటు పారిశ్రామికంగానూ అవసరాలు తీర్చగలగాలి. కానీ, అలా అవన్నీ సక్రమంగా చేస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకవుతుంది? అందుకే రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రాజెక్టులను ప్రభుత్వ పెద్దల స్వార్థ ప్రయోజనాలకు వేదికలుగా, కాంట్రాక్టర్ల జేబులు నింపే మెషినరీగా మార్చేశారు.
కొడంగల్-నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలోనూ అదే జరిగింది. చుక్కనీరు ఎత్తిపోయకుండానే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఏకంగా 132 శాతం పెంచేశారు. పెంచిన మొత్తం ఇతరుల జేబుల్లోకి వెళ్లకుండా పెద్దలే వాటాలు వేసుకొని పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2014లో రూ.1,450 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును ప్రతిపాదిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఏకంగా రూ.6,825 కోట్లకు పెంచింది. అక్కడితో ఆగలేదు. టెండర్లన్నీ నంబర్ 2 మంత్రి కంపెనీకే దక్కడం గమనార్హం.
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): కొడంగల్-నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల ప్రాజెక్టు వేదికగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దల మధ్య ఏర్పడిన క్విడ్ ప్రోకో బంధం అంతకంతకూ విస్తరిస్తున్నది. కాంగ్రెస్ ముఖ్యనేతలు కాసుల వేటకు ఈ ప్రాజెక్టును పావుగా మార్చుకొన్నారన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలంగా ఉంటూ తెరవెనుక అన్నీతానై చక్రం తిప్పుతున్నా నం బర్-2 నేతకు చెందిన కంపెనీకే అన్ని టెం డర్లు దక్కుతుండటం ఈ అనుమానా లను పెంచుతున్నది. నంబర్-2 నేతతో కలిసి ముఖ్యనేత ఈ కాంట్రాక్టు వ్యవహారాలను నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడుతూ, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలకు సాగునీరు అందించడం అటుంచితే, అసలు క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాకముందే కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి రూ.కోట్ల రూపాయల ప్రజాధనం చేరేలా అంచనాలు పెంచడం, టెండర్లు నంబర్-2 నేత కంపెనీకి వచ్చేలా నిబంధనలు మార్చడంతోపాటు రేసులో డమ్మీ కంపెనీలను చేర్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అంచనా వ్యయాన్ని ఐదురెట్లు పెంచేసి..
మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతాల్లోని మెట్ట భూములకు నీరు అందించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదిత నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం వ్యయ అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో 2014లో ఈ ప్రాజెక్టును రూ.1,450.51 కోట్ల ప్రాథమిక అంచనాతో ప్రతిపాదించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు స్వరూపమే మారిపోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024 ఫిబ్రవరిలో విడుదల చేసిన జీవో ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం ఏకంగా రూ.2,945.50 కోట్లకు పెంచారు. ఈ మేరకు కొత్త పరిపాలనా అనుమతులు ఇచ్చారు. అంటే అంచనాలు రెట్టింపు చేశారు. ఆ తర్వాత కొద్దికాలానికే అంచనా వ్యయాన్ని మరోసారి పెంచుతూ రూ.4,350 కోట్లకు సవరించారు. అంటే మరో రూ.1,405 కోట్లు పెరిగింది. అంతటితో ఆగకుండా 2026 ఫిబ్రవరి 24న నిర్వహించిన క్యాబినెట్ భేటీలో మరోసారి వ్యయాన్ని సవరించారని, రూ.4,725 కోట్లకు పెంచుతూ ఆమోదముద్ర వేశారని సమాచారం.
దీనికితోడు మక్తల్ ప్యాకేజీని అదనంగా కలుపుతూ మరో రూ.1,000 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. వీటికితోడు భూసేకరణ కోసం తాజాగా పెంచిన సవరణలను కూడా దీనికి జతచేశారు. అలా ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.6,825 కోట్లకు చేరుకున్నదని ఇరిగేషన్ వర్గాలు తెలిపాయి. అంటే మొదట ప్రతిపాదించిన అంచనా వ్యయంతో పోల్చితే ఏకంగా ఐదు రెట్లు పెరిగింది. క్షేత్రస్థాయిలో కనీస పనులు ఊపందుకోకముందే, ఆయకట్టు విస్తీర్ణం ఒక గుంట కూడా పెరుగకుండానే ప్రాజెక్టు వ్యయాన్ని ఐదు రెట్లు పెంచడం వెనుక భారీ మతలబు ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పనులు పక్కనపెట్టి.. పెంపుపైనే దృష్టి
ఈ ప్రాజెక్టు క్షేత్రస్థాయి పరిస్థితులను లోతుగా పరిశీలిస్తే ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటన్నది ఇట్టే అర్థమవుతున్నదని స్థానికులు చెప్తున్నారు. ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మొత్తంగా 3,000 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని అధికారులు లెకలు తేల్చారు. ఇందులో పంప్‌హౌస్‌ల నిర్మాణానికి 540 ఎకరాలు, ప్రెషర్ మెయిన్స్ తదితర పనులకు మరో ఎనిమిది ఎకరాలు, మిగిలిన భూమిని ప్రధాన కాలువలు, పిల్ల కాలువల తవ్వకం కోసం సేకరించాల్సి ఉంటుందని లెక్కలేశారు.
భూసేకరణ కోసమే అదనంగా రూ.1,404.50 కోట్లు వ్యయమవుతుందని నీటిపారుదల శాఖ గతంలోనే స్పష్టమైన అంచనాలు రూపొందించింది. అయితే, ఇప్పటివరకూ కేవలం పంప్‌హౌస్‌ల నిర్మాణానికి అవసరమైన కొంత భూమిని మాత్రమే సేకరించి అధికారులు చేతులు దులుపుకొన్నట్టు సమాచారం. ప్రధాన కాలువలతోపాటు పిల్ల కాలువలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ ఇంకా కొలికి రాలేదని తెలిసింది. పంప్‌హౌస్‌ల పనులను మొదలుపెడుతున్నామని చెప్తున్న పాలకులు, రైతుల నుంచి ఇప్పటివరకూ సేకరించిన భూములకు ఇవ్వాల్సిన పరిహారం పంపిణీ కంటే ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచడంపైనే అత్యంత ఆసక్తి చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.. భూసేకరణ వ్యయాన్ని కూడా తాజాగా అధికారులు రూ.2,000 కోట్లకు పెంచినట్లు ప్రచారం జరుగుతున్నది.. పూర్తిస్థాయిలో పనులు మొదలయ్యే నాటికి ఈ వ్యయం ఇంకెంత పెరుగుతుందోననే ఆందోళన వ్యక్తమవుతున్నది.
నంబర్-2 నేత కంపెనీకే తొలి టెండర్
ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచడం వెనుక ముఖ్యనేత, నంబర్-2 నేత ఉన్నారనే చర్చ సచివాలయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. నంబ ర్-2 నేతకు చెందిన నిర్మాణ సంస్థకు రాష్ట్రంలోని ప్రధాన కాంట్రాక్టులన్నీ ఏకపక్షంగా కట్టబెడుతున్నారనే ఆరోపణలు మొదటి నుంచీ ఉన్న సంగతి తెలిసిందే. కొడంగల్ ప్రాజెక్టు తొలి దశ పనుల్లో పంచ్ దేవ్ పహాడ్, భూత్పూర్ పంపింగ్ స్టేషన్లు, ఊటూరు, జయమ్మ, కానుకుర్తి తదితర చెరువుల అభివృద్ధి పనులతో కూడిన ప్యాకేజీ-1 కోసం రూ.1,134.62 కోట్లతో టెండర్లు పిలిచారు.
రెండో ప్యాకేజీ కింద ఊటూరు, కానుకుర్తి పంపింగ్ స్టేషన్ల నిర్మాణంతోపాటు పలు పనుల కోసం రూ.1,126.23 కోట్లతో బిడ్లు ఆహ్వానించారు. ఇందులో మొదటి ప్యాకేజీని నంబర్-2 నేతకు చెందిన కంపెనీ దకించుకోగా, రెండో ప్యాకేజీని మరో బడా నిర్మాణ సంస్థ దకించుకున్నదని సమాచారం. అయితే ఈ రెండు సంస్థలు కూడా ప్రభుత్వ అంచనా వ్యయం కంటే 3.95% అధికంగా కోట్ చేసినట్టు తెలిసింది. పనులను సదరు సంస్థలు చేజికించుకోవడం వెనుక ఉన్నతస్థాయిలో పలు ఒప్పందాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆ కంపెనీ కోసం ప్యాకేజీలను ఏకం చేసి
ప్రాజెక్టుకు సంబంధించి రెండో దశ పనుల విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రెండో దశ కింద రూ.1,404 కోట్ల విలువైన పనులను తొలుత మూడు వేర్వేరు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలువాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జాజాపూర్, దౌలతాబాద్, బొమ్రాస్పేట, లక్ష్మీపూర్, ఎర్లపల్లి, హుస్నాబాద్, కొడంగల్ చెరువుల సామర్థ్యం పెంపుతోపాటు గ్రావిటీ కాలువలు, పిల్ల కాలువల నిర్మాణం ఇందులో భాగం. రెండో దశను మూడు వేర్వేరు ప్యాకేజీలుగా విభజిస్తే, మధ్యతరహా కాంట్రాక్టర్ల మధ్య పోటీ ఏర్పడి ప్రభుత్వానికి తకువ ధరలకే పనులు పూర్తవుతాయని నిపుణులు భావించారు. అయితే, ఇక్కడే, నంబర్-2 నేతతో కలిసి ముఖ్యనేత చక్రం తిప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ప్యాకేజీలు వేర్వేరుగా ఉంటే, నంబర్-2 నేతకు చెందిన కంపెనీకి కొంత మొత్తంలోనే లబ్ధి చేకూరుతుందని భావించారో ఏమో.. ప్రతిపాదిత మూడు ప్యాకేజీలను ఏకం చేసి ఏకంగా రూ.2,100 కోట్ల భారీ సింగిల్ ప్యాకేజీగా మార్చినట్టు వార్తలు వస్తున్నాయి.
డమ్మీలను రంగంలోకి దింపి టెండర్‌ను పట్టేసి
కఠినమైన నిబంధనలు పెట్టి ఇతర సంస్థలు ఎక్కువగా పోటీలో లేకుండా చేసి, నంబర్-2 నేత సంస్థకే ఈ పనులు దకేలా పకా వ్యూహం అమలు చేశారనే అనుమానాలు పెరుగుతున్నాయి. దీనికి బలం చేకూర్చేలా.. తాజాగా ఈ టెండర్ పనులు నంబర్-2 నేతకు చెందిన కంపెనీకే దక్కడం గమనార్హం. ఈ తతంగాన్ని నడిపించేందుకు నంబర్-2 నేత అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చినట్టు సమాచారం. అంతేకాదు, ఈ టెండర్ ప్రక్రియలో కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే పాల్గొనగా.. అందులో రెండు కంపెనీలు డమ్మీలేనని వార్తలు రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యనేతతో కలిసే నంబర్-2 నేత తెరవెనుక ఈ మేరకు వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు సంబంధితవర్గాల ద్వారా తెలిసింది.
క్విడ్ ప్రోకో బంధమిది?
ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సంబంధిత శాఖ మంత్రి అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా నంబర్-2 నేతకు లబ్ధి చేకూర్చేలా ముఖ్యనేత వ్యవహారాలను నడిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరి బంధాన్ని కొందరు క్విడ్ ప్రోకో బంధంగా అభివర్ణిస్తున్నారు. కాగా, గతంలో ఓ పార్టీలో ఉండి తర్వాత అధికార పార్టీలో చేరిన నంబర్-2 నేత, ప్రస్తుతం ప్రభుత్వంలో తిరుగులేనివిధంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారని అధికార వర్గాలు అంటున్నాయి.
వివాదాస్పద భూముల వ్యవహారంలో ఆరోపణలు వచ్చినప్పటికీ, సదరు నంబర్-2 నేతపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, రాష్ట్రంలోని ప్రధాన కాంట్రాక్టులన్నీ ఆయనకు చెందిన కంపెనీకే దకడం చూస్తుంటే.. ముఖ్యనేత, నంబర్-2 నేత మధ్య బంధం ఎంత బలంగా పెనవేసుకున్నదో స్పష్టమవుతున్నదని పలువురు చెప్తున్నారు. హైదరాబాద్ నగరంలో చేపడుతున్న మురుగునీటి శుద్ధి కేంద్రాలు, మల్లన్నసాగర్ నుంచి మూసీకి గోదావరి జలాల తరలింపు పనులు, కీలకమైన రేడియల్ రోడ్లు, హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ రోడ్ల నిర్మాణం, రానున్న పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు.. ఇలా ఏ కీలక టెండర్ చూసినా నంబర్-2 నేతకు చెందిన కంపెనీనే రేసులో ముందున్నట్టు ఇంజినీరింగ్ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో అర్హత కలిగిన ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నా, కేవలం ఒకే ఒక నేతకు చెందిన కంపెనీపై ముఖ్యనేత అమితమైన ప్రేమను కనబరచడాన్ని బట్టి క్విడ్ ప్రోకో నడిచిందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
కానీ, రైతులకు మేలు చేయాల్సిన సాగునీటి ప్రాజెక్టును నంబర్-2 నేతకు చెందిన కంపెనీకి లాభాలు సమకూర్చే సాధనంగా మార్చడం సరైన పద్ధతి కాదని మండిపడుతున్నారు. ప్రాజెక్టు అంచనాల పెంపుపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజలకు వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉన్నదని రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. లక్ష ఎకరాల ఆయకట్టుకు రూపొందించిన ప్రాజెక్టు వ్యయం.. పనులు మొదలుకాకముందే రూ.6,825 కోట్లకు ఎలా చేరిందో స్పష్టత ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. మూడు ప్యాకేజీలను రద్దు చేసి సింగిల్ ప్యాకేజీగా మార్చడంపై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో పారదర్శకమైన రీ-టెండర్లు నిర్వహించాలనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తున్నది. సంబంధిత కీలక మంత్రి, అధికారుల అభ్యంతరాలను తొకిపెట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే అది ప్రభుత్వ విశ్వసనీయతకే భంగం కలిగిస్తున్నదని, ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలకు ప్రజలే సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారని ప్రతిపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

