హైదరాబాద్, ఆగస్టు 7( నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారులపై గన్ను ఎకుపెట్టిన వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం నిజంగా దౌర్భాగ్యమని మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం రేవంత్రెడ్డి పరిపాలన లేదని విమర్శించారు. రాజకీయ వివాదాలు సృష్టించి, వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడటం తప్ప ప్రజలకు పనికొచ్చే ప్రజా సంక్షేమ కార్యక్రమం ఏ ఒకటీ చేయడం లేదని దుయ్యబట్టారు.
గురువారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ‘ప్రొఫెసర్ జయశంకర్ అనంతర తెలంగాణ’ అనే అంశంపై వైస్ చాన్సలర్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన నిర్వహించిన సెమినార్లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. అంబేద్కర్ విగ్రహం తెలంగాణకు చిహ్నమని, అంత పెద్ద విగ్రహం కట్టడం, దానిని లోకమంతా చూడటం విశేషమని పేర్కొన్నారు. అటువంటి విగ్రహం జనం చూడకుండా తాళాలు వేయడం ఏ ధోరణి అని ప్రశ్నించారు.
కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్లో నుంచి పరిపాలన చేస్తూ.. అమరవీరుల స్థూపానికి తాళం వేయడం, అంబేదర్ విగ్రహాన్ని ఎవరూ దర్శించుకోకుండా తాళం వేయడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అత్యంత దారుణమైన నిర్ణయాలని విమర్శించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో ఐదు రోజులు, తెలంగాణలో రెండు రోజుల పాలన చేస్తున్నారని ఓ మాజీ జస్టిస్ చెప్పారని అల్లం నారాయణ పేర్కొన్నారు. గురువు డైరక్షన్లోనే శిష్యుని పాలన సాగుతున్నదని ఎద్దేవా చేశారు. గద్దర్ పేరిట అవార్డులు పెట్టి ఆ అవార్డులపై గద్దర్ బొమ్మ లేకుండా అవమానపరిచారని, తెలంగాణకు వ్యతిరేకంగా తీసిన రజాకార్ లాంటి చిత్రాలకు గద్దర్ అవార్డులు ఇవ్వడం గద్దర్పైనే కాదు తెలంగాణపై జరిగిన సాంస్కృతిక దాడిగా ఆయన అభివర్ణించారు.