Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ‘ఇందుగలడందులేడు..’ అన్నట్టుగా ప్రభుత్వంలోని అన్ని శాఖలపై బిగ్ బ్రదర్స్ పంజా విసురుతున్నారు. తాజాగా సమాచార, ప్రజా సంబంధాల శాఖపై (ఐ అండ్ పీఆర్) ‘బాణం’ విసిరారు. వారి అండతో ఐ అండ్ పీఆర్ విభాగంలో కొన్ని నెలలుగా విచ్చలవిడిగా భారీ అవినీతి బాగోతం జరుగుతున్నది. అధికారిక గుర్తింపు లేని సంస్థకు అక్రమంగా రూ.పదుల కోట్ల ప్రకటనలు కట్టబెడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి సిఫారసు చేసిన సంస్థను సైతం పక్కన పడేసి.. ‘ఇండియన్ న్యూస్ పేపర్స్ సొసైటీ’ సస్పెండ్ చేసిన ఏజెన్సీకి విచ్చలవిడివగా వర్క్ ఆర్డర్లు ఇవ్వడం గమనార్హం. ఐ అండ్ పీఆర్ తాజాగా రూపొందించిన ప్యానల్ ఏజెన్సీల్లో ఆ సంస్థ లేకపోవడం మరో విచిత్రం.
ప్రభుత్వం ఏదైనా అంశంపై పత్రికల ద్వారా ప్రచారం చేయాలనుకున్నప్పుడు అడ్వైర్టెజింగ్ ఏజెన్సీ ద్వారా పత్రికలకు ప్రకటనలు జారీ చేస్తుంది. ఢిల్లీ కేంద్రంగా నడిచే ‘ద ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ’ దేశవ్యాప్తంగా ఉన్న అడ్వైర్టెజింగ్ ఏజెన్సీలకు అక్రెడిటేషన్ (గుర్తింపు) ఇస్తుంది. ఆ అక్రెడిటేషన్ ఉన్న ఏజెన్సీల్లో కొన్నింటిని ఐ అండ్ పీఆర్ విభాగం ఎంచుకుంటుంది. వీటిని ప్యానల్ ఏజెన్సీలు అని పిలుస్తారు. ప్రతి మూడేండ్లకు ఒకసారి జాబితాను రెన్యువల్ చేస్తుంది. ఈ ఏజెన్సీలు ప్రభుత్వానికి, పత్రికలకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తుంటాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలకు సంబంధించి డిజైన్ రూపొందించడం, వాటిని పత్రికలకు ఇవ్వడం, ప్రభుత్వం నుంచి బిల్లులు వసూలు చేసి పత్రికలకు అందజేయడం వంటివి వాటి బాధ్యత. ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసే ముందు డిజైన్లు సమర్పించాలని ప్యానల్ ఏజెన్సీలకు సూచిస్తుంది. ఉత్తమ డిజైన్‌ను గుర్తించి ఆ ఏజెన్సీకి వర్క ఆర్డర్ ఇచ్చి, ప్రకటనలు జారీ చేస్తుంది. ప్రకటన జారీ అయిన 60 రోజుల్లోగా ఏజెన్సీలు ప్రభుత్వం నుంచి బిల్లులు వసూలు చేయించి, పత్రికలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కొంత భాగం ఏజెన్సీలకు కమిషన్‌గా వెళ్తుంది. ఈ ఏజెన్సీల పనితీరుపై ఎప్పటికప్పుడు ఐఎన్ఎస్ సమీక్షిస్తుంది. సరిగా పనిచేయని ఏజెన్సీల అక్రెడిటేషన్‌ను సస్పెండ్ చేస్తుంది.
రాష్ట్రంలో దాదాపు 50కిపైగా ప్యానల్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇందులో ‘యారో అడ్వైర్టెజింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ ఏజెన్సీ ఒకటి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.110 కోట్ల మేర పత్రికలకు ప్రకటనలు ఇచ్చినట్టు సమాచారం. ఇందులో 80-90 శాతం ప్రకటనల ఆర్డర్లు యారో అడ్వైర్టెజింగ్ ఏజెన్సీకే దక్కాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. యారో అడ్వైర్టెజింగ్ ఏజెన్సీ అక్రెడిటేషన్‌ను ఐఎన్ఎస్ ఈ ఏడాది మార్చి 22న సస్పెండ్ చేసింది. సంస్థ నుంచి పత్రికలకు బిల్లుల చెల్లింపుల తీరు సరిగా లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆగకుండా ‘యారో’ కంపెనీకి ప్రకటనల ఆర్డర్లు కట్టబెడుతూనే ఉన్నది. తాజాగా.. ఈ నెల 13వ తేదీన రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, సీతారామా లిఫ్ట్ ప్రారంభానికి సంబంధించిన ప్రకటనలను యారో ఏజెన్సీ ద్వారానే ఇచ్చింది. మొత్తం 31 పత్రికల్లో ప్రకటనలకు రూ.10.10 కోట్ల ఆర్డర్ ఇచ్చారు. ఇదొక్కటే కాదని, ఐఎన్ఎస్ సస్పెండ్ చేసిన తర్వాత ఐ అండ్ పీఆర్ నుంచి రూ.పదుల కోట్ల వర్క్ ఆర్డర్ ఇచ్చిందని చెప్తున్నారు. జూన్‌లోనూ రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ పేరుతో 31 పత్రికలకు రూ.7.34 కోట్ల వర్క్ ఆర్డర్ ఇచ్చిందని చెప్తున్నారు. వారం రోజుల కిందట ఐ అండ్ పీఆర్ విభాగం తయారుచేసిన ప్యానల్ ఏజెన్సీల జాబితాలోనూ యారో సంస్థకు చోటు దక్కలేదు. దీనిని బట్టే కంపెనీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
యారోతో సమానంగా తమ సన్నిహితులకు చెందిన కంపెనీకి కూడా వర్క్ ఆర్డర్లు ఇవ్వాలని ఓ మంత్రి స్వయంగా ఈ ఏడాది మార్చిలో సిఫారసు చేసినట్టు సమాచారం. దీంతో మొహమాటానికి రెండు నెలలపాటు కొంత ఆర్డర్లు ఇచ్చారని చెప్పుకుంటున్నారు. కానీ.. ఆ తర్వాత మళ్లీ ఆర్డర్లు మొత్తం యారో కంపెనీకే కట్టబెట్టారని చెప్పుకుంటున్నారు. అదేమని అడిగితే.. ఎవరికి ప్రకటనలు ఇవ్వాలో ‘బిగ్ బ్రదర్స్’ ఆదేశిస్తున్నారని, తాము పాటిస్తున్నామని అధికారులు చెప్తున్నారని సమాచారం. సాధారణంగా ప్రభుత్వాలు ఒక ప్రకటనను రెండుమూడు ఏజెన్సీలకు కలిపి ఇస్తుందని, దీంతో అన్నింటికీ పని దొరుకుతుందని చెప్తున్నారు. ఒకటి రెండు ఏజెన్సీలకు కొద్దిగా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కూడా సహజమేనన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచీ ఏకపక్షంగా యారోకే వర్క్ ఆర్డర్లు ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మిగతా ఏజెన్సీలకు పనిలేకుండా, దివాళా తీసే పరిస్థితి తలెత్తిందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐఎన్ఎస్ ప్రకారం యారో అడ్వైర్టెజింగ్ ఏజెన్సీ గుర్తింపు ఈ ఏడాది మార్చిలోనే రద్దయింది. నిబంధనల ప్రకారం ఆ ఏజెన్సీకి ఐ అండ్ పీఆర్ వర్క్ ఆర్డర్ ఇవ్వరాదు. కానీ తెలంగాణలో యారో ఏజెన్సీకి మార్చి తర్వాత సైతం విచ్చలవిడిగా వర్క్ ఆర్డర్లు జారీ అయినట్టు చెప్తున్నారు. మరి గుర్తింపు లేని కంపెనీకి ప్రభుత్వం బిల్లులు ఎలా చెల్లిస్తుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. యారో ఏజెన్సీ బాగోతం తెలిసిన కొన్ని పత్రికలు ఆ ఏజెన్సీ ఇచ్చిన ప్రకటనలు వేసేందుకు ఒప్పుకోలేదట. దీంతో థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా ప్రకటనలు వేయించినట్టు చెప్పుకుంటున్నారు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. మరి పత్రికలకు ఆ బిల్లులు ఎలా చెల్లిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఐ అండ్ పీఆర్ శాఖలో జరిగిన ఈ అవినీతిని పూర్తిగా వెలికి తీసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.