Radar | హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రాన్ని వికారాబాద్‌లో పెట్టడం దారుణమని, ప్రభుత్వం తన ప్రతిపాదనను తక్షణం విరమించుకోవాలని ప్రముఖ పర్యావరణవేత్త బీవీ సుబ్బారావు డిమాండ్ చేశారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి సహా అనేక ప్రపంచ వేదికల్లో గళం వినిపంచిన బీవీ సుబ్బారావు, వికారాబాద్ ప్రాంతంపై సుదీర్ఘ పరిశోధనలు చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాడార్ కేంద్ర ఏర్పాటు హైదరాబాద్ వాతావరణ, భౌగోళిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆయన ఇంకేమన్నారంటే..
బాధ్యతారాహిత్య నిర్ణయం
దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ కేంద్రం కోసం ఏ మొక్కలను, చెట్లను కొట్టేస్తున్నారో ఎందుకు చెప్పడం లేదు? ఏ అభివృద్ధి ప్రణాళికలోనైనా లాభనష్టాలను బేరీజు వేసుకోవాలి. పర్యావరణ అంశం కూడా అంతే. వికారాబాద్ అడవుల్లో 12 లక్షల వృక్షాలను తొలగిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలోనే అత్యంత విలువైన, అరుదైన ఔషధ మొక్కలు వికారాబాద్ అడవుల్లో ఉన్నాయి. ఇది నేను చెప్పడం కాదు.. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిసెర్చ్ స్కాలర్లు 500కుపైగా ఔషధ మొక్కలను పేర్లతోపాటు గుర్తించారు. 1946లోనే ఇక్కడ నిజాం నవాబు టీబీ శానిటోరియం ఏర్పాటు చేశారు. టీబీ వంటి వ్యాధులను నయం చేయడానికి వికారాబాద్ పరిసర ప్రాంతాలు ఉపయోగపడ్తాయని, ఇక్కడ స్వచ్ఛమైన గాలి లభిస్తుందని గుర్తించి ఇక్కడ టీబీ శానిటోరియం నెలకొల్పారు. సౌత్-వెస్ట్‌లో వికారాబాద్ ఉంటుంది.
మన హైదరాబాద్‌కు వచ్చే గాలి సౌత్-వెస్ట్ నుంచే వస్తుంది. గాలి, నీటిని స్వచ్ఛంగా మార్చడంలో వికారాబాద్ అడవులు ఎంతో కీలకం. గండిపేట నీళ్ల గురించి తెలియనిది ఎవరికి? గండిపేట నీళ్లు ఒంటికి మంచిదని అందరూ చెప్తుంటారు. గండిపేటకు నీళ్లు కూడా వికారాబాద్‌లో పుట్టే మూసీ నది వల్లనే వస్తాయి. వీటన్నింటికి కారణం వికారాబాద్‌లో ఉన్న ఔషధ మొక్కలే. ఇలాంటి అద్భుతమైన ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించాలి. ఇప్పటివరకు ప్రభుత్వాలు ఆ పని ఎందుకు చేయలేదు? ప్రతి పంచాయతీలో ఔషధ మొక్కల రిజిస్టర్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ, ఆచరణలో పెట్టడంలేదు.
ప్రజలను మోసం చేస్తున్నారు
వికారాబాద్, దామగుండం రెండూ వేర్వేరు కావు. రెండూ ఒకే అడవిలోని రెండు ప్రాంతాలు. ఇక్కడి అడవిలో అత్యంత అరుదైన ఔషధ మొక్కలు, అరుదైన వృక్షజాతులే కాదు.. వన్యప్రాణులు కూడా ఉన్నాయి. ఇలాంటి అడవిని వికారాబాద్ వేరు, దామగుండం వేరు అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం ప్రజలను మోసం చేయడమే. నేవీ అధికారులు ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. వికారాబాద్-దామగుండం ప్రాంతంలో అసలు చెట్లే లేవని, ఇక్కడంతా మైదాన ప్రాంతాలే ఉన్నాయని, అందుకే రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం, అటవీ అధికారులు ఎందుకు ఖండించలేదు?
హెల్త్ టూరిజంగా చేయవచ్చు
ఇప్పుడు రాష్ట్రంలో హెల్త్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నాయి. హెల్త్ టూరిజం అంటే ఏమిటి? ఫైవ్‌స్టార్ దవాఖానలు కట్టి ప్రజలను మాయ చేయడమే కదా? మరి ప్రకృతిసిద్ధమైన వికారాబాద్‌ను హెల్త్టూరిజంగా చేయవచ్చు కదా? ఎందుకు చేయలేదు? ప్రకృతిసిద్ధంగా ఉన్న ఔషధ మొక్కల మధ్య ఒక పది రోజులు మనిషి ఉంటే రోగాలన్నీ మాయమవుతాయి కదా?
ఎందుకు విలువ కట్టడంలేదు?
ఏదైనా సంస్థ లేదా వస్తువును అమ్మేటప్పుడు దానికి విలువ కడుతుంటాం. ఇంత పెద్ద అడవికి ఏం విలువ కట్టారు వీళ్లు? ఎలా విలువ మదింపు జరిగింది? ఇక్కడ ఉన్న చెట్లు ఇచ్చే స్వచ్ఛమైన గాలికి, అమూల్యమైన ఔషధ మొక్కలకు విలువ లేదా? జియో బయోైక్లెమెటిక్ వాల్యుయేషన్ చేయాలి. ఇలా మదింపు చేసిన విలువకు సంబంధించిన శ్వేతపత్రాన్ని ప్రభుత్వం ప్రజల ముందు పెట్టాలి. శ్వేతపత్రాన్ని శాసనసభలో కూడా పెట్టి చర్చించాలి. దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటువల్ల తలెత్తే పరిణామాలు ఇలా ఉంటాయని వివరిస్తూ ఒక సమగ్ర నివేదిక ప్రజల ముందు ఎందుకు పెట్టలేదు?
‘జల’ స్వరూపం మారిపోతుంది
చెట్లు కొట్టేయడం, రాడార్ స్టేషన్ కట్టడం వల్ల ఇక్కడ హైడ్రోలాజికల్ కండిషన్స్ మొత్తం మారిపోతాయి. చెట్లు పోయి, కాంక్రీట్ జంగిల్ వస్తుంది. ఊటలు ఎండిపోతాయి. గ్రౌండ్ వాటర్ పడిపోతుంది. నది మనుగడకే ముప్పు కలుగుతుంది. మూసీ నదిని బాగు చేస్తామని లండన్ పోతున్నరు కానీ.. దామగుండంపోయి నది ఎట్లా పుట్టిందో ఎవరైనా చూస్తున్నారా? మంజీరా నది పుట్టేది కూడా ఇక్కడే. ఇలా ఐదు ఉప నదులు పుడుతున్న పవిత్రమైన స్థలం ఇది. దీనిని ఆధ్యాత్మికంగానూ మనం కాపాడుకోవాలి. మూసీ నది నాకు పవిత్రం. ఈసా, మూసా కలిసిన పవిత్ర సంగమం. దానిని మనమే కాపాడుకోలేనప్పుడు ఎవరో ఇంగ్లిష్ వాళ్లు వచ్చి చేస్తారంటే ఎలా నమ్మేది. పైన నాశనం చేసుకుంటూపోతూ కింద ఆనకట్టలు కడతామంటే ఎలా?
సర్ మిర్జా అలీ రిపోర్ట్ చూడండి
సర్ మిర్జా అలీ.. ఫస్ట్ ల్యాండ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మూసీ రివర్. ఆయన రిపోర్ట్ చూస్తే నది పవిత్రత తెలుస్తుంది. మూసీ వెంబడి 14 ఉద్యాన వనాలను ఆనాడే అభివృద్ధి చేశారు. ఓల్డ్ సిటీ నుంచి చిక్కడపల్లి వరకు 1965 వరకు పార్కులు ఉండేవి. దామగుండంలో ఉన్న జీవవైవిధ్యం, రాతి శిలల వైవిధ్యం మాదిరిగానే ఇక్రిశాట్లో ఇంతే వైవిధ్యమైన భూములున్నాయి. అందుకే ఏరికోరి ఇక్రిశాట్ను అక్కడే స్థాపించారు.
రాడార్ ఇక్కడే ఎందుకు?
నేవల్ సిగ్నల్ స్టేషన్ ఇక్కడ కాకుండా మరెక్కడా పెట్టొద్దని ఉన్నదా? ఈ స్టేషన్ కోసం కర్ణాటకలోని కోలార్ బంగారు గనుల ప్రాంతం ఇస్తామన్నారు. కోలార్ గనులను తవ్వడం ఆపేశారు. అక్కడ పెడితే ఆ ప్రాంతం బాగుపడుతుంది. కొత్త టౌన్షిప్ వస్తుంది. అనేక యూరోపియన్ దేశాల్లో ఇలాంటి వదిలివేసిన గనుల్లో అనేక టౌన్‌షిప్‌లు వచ్చాయి. మనం ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాం? ప్రజలు, పర్యావరణ మనుగడకు ఇబ్బందికలిగేలా వ్యవహరించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగదు అని హితవు పలికారు.
ఐదు నదుల జన్మస్థానం
వికారాబాద్ ప్రాంతం అద్భుతమైనది. ఇక్కడ ఒకరకమైన రాతినేలలు కూడా ఉన్నాయి. అడవులు, రాతినేలలు కలిసిన ప్రాంతం. అందుకే ఇక్కడ వందల సంఖ్యలో నీటి ఊటలున్నాయి. వికారాబాద్‌లో ఉన్న అటవీ ప్రాంతం నుంచే మూసీ, ఈసా, కాగ్నా, భీమా వంటి కృష్ణా నది ఉపనదులు పుడుతాయి. విచిత్రం ఏమిటంటే ఇక్కడి నీటిధారల నుంచే మంజీరాకు సైతం ఒక నీటిధార వెళ్తున్నది. ఇక్కడ చెట్లను తీసివేస్తే వచ్చే వరదను మనం భరించగలమా? వరదలు వస్తే హైదరాబాద్ సహా చుట్టు పక్కల ప్రాంతాల పరిస్థితి ఏమిటో ఆలోచించారా? దామగుండం నుంచి కాగ్నా నది వరద తాండూరు వైపు పోతుంది. దారిలో వచ్చే కల్వర్టులన్నీ కొట్టుకు పోయేంత ఉదృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ వరదను అడ్డుకునే ల్యాండ్ కవర్‌గా ఉన్న చెట్లను తొలిగిస్తే వరద ఉదృతి ఇంకా పెరుగుతుంది. దీనిపై ఏమైనా హైడ్రాలాజికల్ స్టడీస్ ఉన్నాయా? లక్షల చెట్లు కొట్టేసిన తర్వాత వరద ఎంత పెరుగుతుంది? అని అధ్యయనం లేకపోవడం వల్లే మెట్రో నగరాల్లో వరద ముప్పు పెరిగింది. దామగుండానికి సంబంధించి పర్యావరణ ప్రభావం అంచనా వేయలేదు. రిస్క్ అసెస్మెంట్ చేయలేదు, ఫైనాన్షియల్ అసెస్మెంట్ చేయలేదు. చెట్ల నరికివేత వల్ల కలిగే నష్టాన్ని అంచనా వేయలేదు.
అమెరికాలో మూసేసిన టెక్నాలజీ మనకెందుకు?
వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం పనితీరుపై అనేక అనుమానాలున్నాయి. ఆరోగ్య సమస్యలు వస్తాయని గత అనుభవాలు చెప్తున్నాయి. అమెరికా వంటి దేశాల్లో వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రాలను ప్రభుత్వాలు మూసేశాయి. అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నాయి. మరి మనమెందుకు ఈ పాత టెక్నాలజీని వినియోగిస్తున్నాం? ప్రజల్లో దీనిపై అనేక అనుమానాలున్నాయి. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ను చేయలేదు. రిస్క్ అసెస్మెంట్ కూడా చేయలేదు. బయోడైవర్సిటీ అసెస్మెంట్ కూడా జరగాల్సి ఉంటుంది. అంటే ఒక మొక్క వల్ల కలిగే ఉపయోగాలు, దాని రాయల్టీ వల్ల వచ్చే ఆదాయం కూడా చూపించాల్సి ఉంటుంది. రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు ఏం చేస్తున్నది? ఇవన్నీ చేయాలి కదా? అసలు వీళ్ల వద్ద ఒక్క రికార్డు కూడా లేదు. వికారాబాద్ అడవుల్లో లభించే ఔషధ మొక్కలు ఏమిటి? వాటిని గుర్తించదగ్గ సామర్థ్యం ఉన్న స్థానిక ప్రజలు ఎందరున్నారన్న సమాచారం కూడా వీళ్ల వద్ద లేదు. ఇక్కడున్న అపారమైన సంపద తెలంగాణ ప్రజల ఆస్తి.
5న దామగుండం రిసార్ట్స్ యజమానులతో మీటింగ్
వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు రిసార్ట్స్ యజమానులతో వికారాబాద్ జిల్లా అటవీ అధికారి ఈనెల 5న సమావేశం కానున్నారు. వికారాబాద్‌లోని జిల్లా అటవీ అధికారి కార్యాలయంలో 15 రిసార్ట్స్ యజమానులతో చర్చించనున్నారు. ఇప్పటికే ఆయా రిసార్ట్స్ యజమానులకు ఫారెస్ట్ రేంజ్ అధికారి నుంచి సమాచారం పంపించారు. దామగుండం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే నేవీ వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాడార్ కేంద్రం ప్రయోజనాలు వారికి వివరించి, ఏర్పాటుకు సహకరించాలని వారిని అటవీ అధికారులు కోరనున్నారు.