TS TET | హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాస్తున్నారా.. అయితే అభ్యర్థులు ఓఎమ్మార్ షీట్‌లోని గడులను బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తోనే పూరించాలి. మరే రంగు పెన్నుతో నింపడానికి అనుమతించరు. ఆఖరుకు బ్లూ కలర్ పెన్ను వాడినా అంగీకరించరు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్ష జరుగనున్నది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు హెచ్చరించారు. అభ్యర్థులంతా ఉదయం 9 గంటల లోపు, మధ్యాహ్నం 2 గంటల లోపే పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష ముగిశాకే అభ్యర్థులను బయటికి పంపుతారని తెలిపారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే యాక్ట్ 25/97 ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణకు ఉన్నతాధికారులను పరిశీలకులుగా నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,052 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయగా, పేపర్1కు 2,69,557 మంది అభ్యర్థులు, పేపర్2కు 2,08,498 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
టెట్ పరీక్ష నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. టెట్ పరీక్షాకేంద్రాల విద్యాసంస్థలకు గురువారం మధ్యాహ్నం పూట, శుక్రవారం నాడు సెలవు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులిచ్చారు. మిగతా విద్యాసంస్థలు యథాతథంగా నడుస్తాయని పేర్కొన్నారు.
టెట్ పరీక్ష సీసీటీవీ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. పరీక్షాకేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ల గదుల్లో సీసీకెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాలను తెరుస్తారు. పరీక్ష నిర్వహణకు 2,052 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, 22,572 మంది ఇన్విజిలేటర్లు, 10,260 హాల్ సూపరింటెండెంట్లను నియమించినట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. ఓఎమ్మార్షీట్ను మలవడం, పిన్నులు కొట్టడం, ట్యాంపర్ చేసేందుకు ప్రయత్నించొద్దని అభ్యర్థులకు రాధారెడ్డి సూచించారు.