సోమవారం 25 మే 2020
Telangana - Apr 03, 2020 , 01:21:10

కమనీయం.. రాములోరి కల్యాణం

కమనీయం.. రాములోరి కల్యాణం

  • భద్రాద్రి దివ్యక్షేత్రంలో నిరాడంబరంగా శ్రీరామనవమి
  • హాజరైన మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌
  • ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారాముల కల్యాణం గురువారం నిరాడంబరంగా సాగింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రామాలయం ప్రాంగణంలోని బేడా మండపంలోనే రాములవారి కల్యాణాన్ని నిర్వహించారు. ఆలయంలోని ధ్రువమూర్తుల కల్యాణం అనంతరం శ్రీసీతారామచంద్రస్వామివారిని మంగళవాద్యాల నడుమ బేడా మండపానికి తీసుకొచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యఃవచనం, రక్షా బంధనం, మోక్షబంధనం నిర్వహించారు. గోదానం చేసి మహాసంకల్పం పఠించారు. సాక్షాత్‌ విష్ణుస్వరూపుడైన శ్రీరామునికి శ్రీమహాలక్ష్మి స్వరూపమైన సీతను జగత్కల్యాణార్థం మంత్రధార పూర్వకంగా కన్యాదానంచేశారు. 

మంగళవాద్యాలు మారుమోగుతుండగా, వేద మంత్రాల మధ్య అభిజిత్‌లగ్నం సమీపించగానే అర్చకులు జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సులపై ఉంచారు. జనకమహారాజు, దశరథ మహారాజు తరఫున చేయించిన రెండు మంగళసూత్రాలతోపాటు భక్తరామదాసు సీతమ్మకు చేయించిన మరొక మంగళసూత్రం కలిపి మూడు సూత్రాలతో మాంగళ్యధారణ గావించారు. స్వామివారికి పచ్చల పతకం, సీతమ్మకు చింతాకు పతకం, లక్ష్మణస్వామికి రామమాడ అలంకరించారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ప్రభుత్వం తరఫున శ్రీసీతారామచంద్రస్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణ తంతును ఆద్యంతం తిలకించారు. సీతారాముల కల్యాణానికి ఎంపీ మాలోతు కవిత, భద్రాద్రి కొత్తగూడె జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, ఎస్పీ సునీల్‌దత్‌, భద్రాద్రి ఆలయ ఈవో జీ నరసింహులు, ఆర్డీవో స్వర్ణలత, ఏఎస్పీ రాజేశ్‌చంద్ర, ఆలయ ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్‌, స్థానాచార్యులు స్థలసాయి, వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు హాజరయ్యారు.


logo